నేడు శ్రీవారి క్షేత్రంలో రథసప్తమి వేడుకలు
ద్వారకాతిరుమల: రథసప్తమి వేడుకలకు శ్రీవారి క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. అందులో భాగంగా ఆదివారం నిర్వహించనున్న స్వామి, అమ్మవార్ల తిరువీధి సేవలకు వినియోగించే సూర్య, చంద్ర ప్రభ వాహనాలను ఆలయ సిబ్బంది శనివారం ముస్తాబు చేశారు. ముందుగా వాహన శాల నుంచి తీసుకొచ్చిన సూర్య, చంద్ర ప్రభ వాహనాలను ఆలయ ఆవరణలో ఉంచారు. అనంతరం వాటిని శుభ్రం చేశారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 7 గంటల నుంచి స్వామి, అమ్మవార్లకు సూర్య ప్రభ వాహనంపై, అలాగే రాత్రి 7 గంటల నుంచి చంద్ర ప్రభ వాహనంపై తిరువీధి సేవలను కన్నులపండువగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆయన కోరారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరుకు చెందిన బెజగం వెంకట శ్రీనివాసు ప్రతిష్టాత్మక గురురత్న అవార్డుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన నగరంలోని గ్రీన్‌సిటీలో నివసిస్తూ నారాయణపురంలోని మహాత్మాగాంధీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్స్‌పాల్‌గా, జంతుశాస్త్ర అధ్యాపకునిగా పని చేస్తున్నారు. గత 37 సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో సేవలు అందిస్తూ రచయితగా, పాఠ్యపుస్తక రచయితగా, విద్యా వ్యాసకర్తగా, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అసోసియేట్ అధ్యక్షునిగా వివిధ రంగాల్లో అందిస్తున్న ఆయన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ మేరకు చైన్నెకి చెందిన అమెట్ యూనివర్సిటీ, జే. రామచంద్రన్ మారిటైమ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఆయన్ను గురురత్న అవార్డుకు ఎంపిక చేసినట్టు ప్రకటించాయి. ఈ నెల 25వ తేదీన చైన్నెలోని అమెట్ యూనివర్సిలో వర్సిటీ ఛాన్సలర్ జే.రామచంద్రన్ చేతులమీదుగా శ్రీనివాస్ అవార్డు అందుకోనున్నారు.
ఏలూరు(మెట్రో): విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఫిబ్రవరి 5 వ తేదీన జరుగబోయే ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం స్థానిక ఏలూరు రెవెన్యూ భవన్‌లో నాయకులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆ సంఘం ఏలూరు జిల్లా చైర్మన్ కె.రమేష్ కుమార్ మాట్లాడుతూ ఈ మహాసభకు జిల్లా ఉద్యోగులు తరలి వెళ్లడానికి ఏలూరు నుంచి బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి తదితర ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారాల కోసం మహాసభల్లో ఉద్యోగుల గళం వినిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి జనరల్ సెక్రెటరి బి.రాంబాబు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఏ.ప్రమోద్ కుమార్, ఏపీపీటీఏ గౌరవ అధ్యక్షుడు వై.శ్రీనివాస్, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మహాలక్ష్ముడు, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్, ఏలూరు డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణ స్వామి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నేడు శ్రీవారి క్షేత్రంలో రథసప్తమి వేడుకలు
నేడు శ్రీవారి క్షేత్రంలో రథసప్తమి వేడుకలు


