కానరాని పసివాడి జాడ
● అదృశ్యమై నాలుగు రోజులైనా లభించని ఆచూకీ
● దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ముదినేపల్లి రూరల్: రెండున్నరేళ్ల బాలుడు ఇంటి ముంగిట ఆటలాడుకుంటూ తప్పిపోయాడు. నాలుగు రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడంతో ఆ తల్లి కంట కన్నీరు ఆగడం లేదు. పోలీసులు పలు విధాలుగా గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటివరకు ఎటువంటి ప్రయోజనం లేదు. వివరాలు ఇలా ఉన్నాయి. మండవల్లి మండలం కానుకొల్లుకు చెందిన ఆకేటి శిరీష ముదినేపల్లి మండలంలోని శ్రీహరిపురంలో ఉన్న పుట్టింటికి వచ్చింది. ఆమె కుమారుడు రెండున్నర సంవత్సరాల వయసు గల మోక్షిత్ ఈ నెల 20న ఆటలాడుకుంటూ అదృశ్యమయ్యాడు. దీనిపై స్థానిక పోలీసుస్టేషన్లో బాలుడి తల్లి శిరీష ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరిసర ప్రాంతాల్లో పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలించినప్పటికీ ఫలితం కనిపించలేదు. స్థానికంగా ఉన్న పంట కాలువలో పడి బాలుడు గల్లంతయి ఉంటాడని భావించి నాలుగురోజులుగా స్థానికంగా ఉన్న క్యాంపుబెల్ పొడవునా గాలింపు చర్యలు చేపట్టినప్పటికి జాడ దొరకలేదు. అదేవిధంగా బాలుడిని ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా ఫలితం లేకపోవడంతో బాలుడి తల్లి, కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ లతీఫ్ పాషా, ఎస్సై వీరభధ్రరావుతో శ్రీహరిపురం వెళ్లి బాలుడి తల్లితో పాటు స్థానికులను విచారించారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారని త్వరలోనే ఆచూకీ తెలుసుకుంటారని చెప్పారు. ఇందుకు సంబంధించి ఎస్సైతో పాటు సిబ్బందికి తహసీల్దార్ పలు సూచనలు చేశారు.
కానరాని పసివాడి జాడ


