ఎరువు.. బరువు
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
ఏలూరు (మెట్రో): ప్రభుత్వ సాయం శూన్యం.. ప్రకృతి కనికరం లేదు.. దళారుల దోపిడీ.. ఇలా ప్రతి సీజన్ లోనూ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఖరీఫ్ సీజన్‌లో ప్రకృతి వైపరీత్యాలు, యూరియా కష్టాలు, ప్రభుత్వ వంచనతో దగా పడ్డ రైతన్నలు రబీ సాగుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఎరువుల ధరలు వీరిని బెంబేలెత్తిస్తున్నాయి.
2.38 లక్షల ఎకరాల్లో..
జిల్లాలో వరి, మొక్కజొన్న ప్రధాన పంటలు కాగా పొగాకు, అపరాలు మొత్తం 2.38 లక్షల ఎకరాల్లో రబీ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గత సీజన్ కంటే అధికంగా పెట్టుబడులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత సీజన్ లో వరికి మద్దతు ధర లేకపోవడం, మోంథా తుపానుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎకరా సాగుకు పంటను బట్టి రూ.35 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చవుతోంది. ఈ ఏడాది ఎరువులు, కూలీల ధరలు సైతం పెరగడంతో ముఖ్యంగా ఈ రబీ సీజన్‌లో ఎకరాకు మరో రూ.15 వేలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పంట ఉత్పత్తుల ధరల సైతం పూర్తిగా పతనం కావడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
ఎరువుల ధరలతో బెంబేలు
ఎరువుల ధరలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. చంద్రబాబు సర్కారులో ఎరువుల ధరలకు కళ్లెం వేసే నాథుడే కరువయ్యాడు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో (2019–24) ఎరువుల ధరలు నిలకడగా ఉన్నాయి. గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచుతూ సరసరమైన ధరలకు అందిచేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం కావడంతో డిమాండ్ ఉన్న యూరియా వంటి ఎరువులను కృత్రిమ కొ రత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇలా వ్యాపారుల దోపిడీతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే ఏటా ఎరువుల ధరలు పెరగడంతో అప్పులపాలవుతున్నారు.
ఎరువుల ధరలు (బస్తా 50 కిలోలు)
రకం గతంలో ప్రస్తుతం
20–20–0 రూ.1,250 రూ.1,350
10–26–26 రూ.1,470 రూ.1,850
15–15–15 రూ.1,450 రూ.1,650
14–35–14 రూ.1,700 రూ.1,850
పొటాష్ రూ.1,550 రూ.1,800
28–28–0–28 రూ.1,700 రూ.1,850
20–20–0–13 రూ.1,300 రూ.1,450
డీఏపీ రూ.1,350 రూ.1,350
యూరియా రూ.266 రూ.270
రైతు నెత్తిన దరువు
ప్రతి సీజన్‌లో భారీగా పెరుగుతున్న పెట్టుబడులు
ప్రభుత్వ సాయం శూన్యం
జిల్లాలో 2.38 లక్షల ఎకరాల్లో రబీ సాగు
దాళ్వాకు సిద్ధమైన అన్నదాతలు
జిల్లాలో రబీ సీజన్ ప్రారంభమైంది. వ్యాపారులు ప్రభుత్వ నిర్ణయించిన ధరల మేరకే ఎరువులు విక్రయించాలి. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే ఏ ఒక్క ఎరువుకైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు. ఎరువులు, పురుగు మందుల పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటుచేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.
– హబీబ్ బాషా, జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్
ఎరువు.. బరువు


