ప్రైవేటుపై నిరసన ‘సంతకం’
● నేడు ఏలూరులో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ
● కోటి సంతకాల ప్రతులు తాడేపల్లి తరలింపు
ఏలూరు టౌన్ : రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడా న్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం తుది దశకు చేరుకుంది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సేకరించిన కోటి సంతకాల ప్రతులను ఏలూరులోని పార్టీ జిల్లా కా ర్యాలయానికి చేర్చగా.. సోమవారం ఏలూరు నుంచి వీటిని తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి భారీ ర్యాలీతో తరలించేలా రంగం సిద్ధం చేశారు.
పెద్ద రైల్వేస్టేషన్ నుంచి..
ఏలూరులో భారీ ర్యాలీకి నాయకులు సన్నాహాలు చేశారు. ఉదయం 10 గంటలకు పెద్ద రైల్వేస్టేషన్ ప్రాంతం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సీఎస్‌ఐ చర్చి, రైల్వే ఫ్‌లైఓవర్ బ్రిడ్జి మీదుగా పాతబస్టాండ్ సెంటర్, ప్రధాన రహదారి, వసంత్‌మహల్ సెంటర్, జూట్‌మిల్లు ప్రాంతం, మినీ బైపాస్ మీదుగా ఏలూరు నగర శివారు వరకు ర్యాలీ కొనసాగుతుంది. కోటి సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో ఉంచి పార్టీ శ్రేణులు, అభిమానులు ర్యాలీగా తరలివెళతారు.
జిల్లాలో 3.60 లక్షలకు పైగా..
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రెండు నెలలపాటు కోటి సంతకాల ప్రజా ఉద్య మం సాగింది. మొత్తంగా 3.60 లక్షలకు పైగా సంతకాలు సేకరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దూ లం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టే భారీ ర్యాలీలో ఏలూరు పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంకా రవీంద్ర, ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జి, జోనల్–2 యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్‌కుమార్, బీసీసెల్ జోనల్–2 వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ, సమన్వయకర్తలు మామిళ్లపల్లి జయప్రకాష్ (ఏలూరు), కొఠారు అబ్బయ్యచౌదరి (దెందులూరు), మేకా వెంకట ప్రతాప్ అప్పారావు (నూజివీడు), పుప్పా ల వాసుబాబు (ఉంగుటూరు), తెల్లం బాలరాజు (పోలవరం), కంభం విజయరాజు (చింతలపూడి) హాజరవుతారు. అలాగే పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలిరానున్నారు.


