మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరు
● 15న ఏలూరులో భారీ ర్యాలీ
● పార్టీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఏలూరు జిల్లావ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల పరిధిలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా కేంద్రం నుంచి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లికి సంతకాల పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని ఏలూరులో భారీగా చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, దెందులూరు సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి, చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు, ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ వినతిపత్రం అందజేశారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీని ప్రత్యేకంగా కలిసి ర్యాలీకి అనుమతి కోరారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ మాట్లాడుతూ ఈనెల 15న ఏలూరు జిల్లా కేంద్రం నుంచి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతకాల పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఏలూరులో చేపట్టే ర్యాలీకి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతారన్నారు. శాంతిభద్రతలకు విఘాతం లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా కార్యక్రమాన్ని నిర్వహించేలా పోలీస్ అధికారుల తమ వంతు చర్యలు చేపట్టాలని కోరామన్నారు. సభలు, సమావేశాలు ఏమీ లేకుండా ర్యాలీగా ఏలూరు శివా రు వరకూ పత్రాలతో కూడిన వాహనాన్ని పంపేలా ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘంటా మోహనరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్, లీగల్ సెల్ ఏలూరు అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు మద్దాల ఫణి, నగర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, రెళ్ల రామకృష్ణ ఉన్నారు.


