వెల్లువెత్తిన ప్రజా చైతన్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజా పోరుబాట తుది అంకానికి చేరింది. విద్యార్థుల భవిష్యత్‌ను పణంగా పెట్టి పేద విద్యార్థులకు అన్యాయం చేసేలా సర్కారు తీసుకుంటున్న చర్యలపై సామాన్యుడు సైతం రగిలిపోతున్నాడు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణకు జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. 7 నియోజకవర్గాల్లో లక్షలాది సంతకాలు సేకరించి బుధవారం అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి ఏలూరు జిల్లా కార్యాలయానికి కోటి సంతకాల పత్రాలు పంపనున్నారు. గ్రామ గ్రామాన స్వచ్ఛందంగా సంతకాలు సేకరించి వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా నియోజకవర్గ ఇన్‌చార్జి మొదలుకొని సాధారణ కార్యకర్త వరకు అందరూ భాగస్వాములై నిర్మాణాత్మకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అక్టోబర్‌లో ప్రారంభమైన కోటి సంతకాల ప్రజాఉద్యమం, రచ్చబండలు గ్రామ స్థాయిలో సమావేశాలు, ఇంటింటికి తిరిగి సంతకాల సేకరణ చేయడంతో పాటు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణతో జరిగిన నష్టాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా యువత, న్యాయవాదులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో మద్దతు పలికారు. జిల్లా కోర్టు వద్ద నిర్వహించిన కోటి సంతకాల సేకరణకు న్యాయవాదుల సంపూర్ణ మద్దతు ఇచ్చారు. పెద్ద ఎత్తున సంతకాలు చేశారు. జిల్లాలో 4 లక్షలకుపైగా సంతకాలు సేకరించి ప్రతి నియోజకవర్గంలోనూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు.
నేడు కోటి సంతకాలతో ర్యాలీ : జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సమన్వకర్తల నేతృత్వంలో కోటి సంతకాల పత్రాలతో ర్యాలీలు నిర్వహించనున్నారు. ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లో కోటి సంతకాల పత్రాలను ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించి 7 నియోజకవర్గాల నుంచి పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించి జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావుకు అప్పగించనున్నారు.
భీమవరంలో మద్దతు తెలుపుతూ సంతకాలు చేస్తున్న ప్రయాణికులు
భువనపల్లిలో జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఎంఎల్‌సీ వంకా రవీంద్రలకు కోటి సంతకాల పత్రాలను అందిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు
జిల్లాలో విజయవంతంగా కోటి సంతకాల సేకరణ
చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం
నేడు 7 నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు
అనంతరం పార్టీ కార్యాలయానికి సంతకాల ప్రతులు
వెల్లువెత్తిన ప్రజా చైతన్యం


