రోడ్డెక్కిన చిరుద్యోగులు
● కనీస వేతనం రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్
● ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని వినతి
ఏలూరు (టూటౌన్): ఏళ్ల తరబడి చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నా ప్రభుత్వం తమపై కనికరం చూపకపోవడం బాధాకరమని స్కూల్ స్వీపర్లు, శానిటరీ వర్కర్లు, నైట్ వాచ్‌మెన్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 8 నుంచి 10 గంటలు పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని, ఇచ్చే అరకొర జీతాలు సైతం పెండింగ్‌లో ఉంటున్నాయని చెబుతున్నారు. స్కూలు స్వీపర్లకు నెలకు రూ.4 వేలు, శానిటేషన్ వర్కర్‌కి నెలకు రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నారు. కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని, రెండు నెలలుగా బకాయి ఉన్న జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కూడా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రెండు నెలల క్రితం ఆందోళన చేపట్టిన వీరు.. ఇప్పటికీ తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో మరోసారి ఆందోళనకు దిగారు. ఏలూరు కార్పొరేషన్ ఎదుట రెండు రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు.
జిల్లాలో 1900 మందికి పైనే..
ఏలూరు జిల్లా వ్యాప్తంగా 1900 మందికి పైగా స్కూల్ స్వీపర్లు, శానిటరీ వర్కర్లు, నైట్ వాచ్‌మెన్‌లు ఏళ్ళ తరబడి విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒక్క ఏలూరు నగరంలోనే 180 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. రోజంతా పనిచేసినా తమకు కనీస వేతనం దక్కకపోవడం పట్ల వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది వెట్టి చాకిరీ కాదా?
పేరుకే పార్ట్‌టైం కంటింజెంట్ పోస్టు అని, చేయించుకునేది రోజుకు 10 గంటల పని అని చెబుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉంటున్నామని పేర్కొంటున్నారు. ఇన్ని పనులు చేసినా తమకు ఇచ్చే వేతనం రూ.4 వేల నుంచి రూ.6 వేలు మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


