కన్ను పడితే కబ్జా | - | Sakshi
Sakshi News home page

కన్ను పడితే కబ్జా

Dec 10 2025 7:56 AM | Updated on Dec 10 2025 7:56 AM

కన్ను

కన్ను పడితే కబ్జా

నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో రూ.50 కోట్ల భూములు హాంఫట్‌

కూటమి పెద్దల దురాక్రమణలో ప్రభుత్వ భూములు

నిర్మాణాలు చేసి అద్దెలకు ఇస్తున్న వైనం

నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపాలిటీని ఆనుకుని ఉన్న లక్ష్మణేశ్వరం గ్రామంలో విలువైన కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములు కొందరు పెద్దల దురాక్రమణలోకి వెళ్లిపోతున్నాయి. కొందరు రాజకీయ నేతలు ప్రభుత్వ భూములపై కన్నేసి యథేచ్ఛగా వ్యవహారాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే లక్ష్మణేశ్వరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని కోట్లలో సొమ్ములు చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారాలపై గ్రామస్తులు కొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా.. ముడుపుల మత్తు, అధికార పార్టీ భయంతో పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఒకపక్క ప్రభుత్వ అవసరాలకు, అభివృద్ధి పనులకు కనీసం ఓ 10 సెంట్ల భూమి కావాలన్న లభించని స్థితి ఉండగా, మరోపక్క విలువైన ఇలాంటి ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం లేదు.

ఆక్రమించుకుని అమ్ముకుంటూ..

నరసాపురం పట్టణ పరిధిలో పీచుపాలెంకు ఆనుకుని ఉన్న లక్ష్మణేశ్వరం గ్రామంలో పెద్ద విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ ప్రాంతం మున్సిపాలిటీలో విలీనమయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంత భూములపై కొందరు రాజకీయ పార్టీల నేతల కళ్లు పడ్డాయి. దీంతో సదరు భూములను ఎవరి శక్తి మేరకు వారు ఆక్రమించుకుని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. రియల్టర్లు కొందరు వెంచర్లు వేసి అమ్మేస్తున్నారు. ఆక్రమణకు గురైన భూములపై బ్యాంకుల్లో రుణాలు కూడా భారీగా తీసుకుంటున్నట్టు సమాచారం. పక్కా భవన నిర్మాణాలు, కమర్షియల్‌ భవన నిర్మాణాలు చేసి, నెలనెలా భారీగా అద్దెలు కూడా దండుకుంటున్నా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు.

మురుగు కాలువను మాయం చేశారు

రోడ్డు పక్కన ఆర్‌అండ్‌బీ స్థలాలతో పాటు, ఇరిగేషన్‌కు చెందిన భూములు పెద్ద విస్తీర్ణంలో ఆక్రమణకు గురైనట్టు తెలుస్తోంది. వేములదీవి ఛానల్‌కు అనుసంధానంగా ఉన్న ఓ మురుగు కాల్వను కబ్జాదారులు పూర్తిగా పూడ్చేసి అక్కడ ఒకప్పుడు కాలువ ఉండేదన్న సంగతి కూడా తెలియకుండా చేశారు. ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌కు దారిగా మార్చేసి.. ప్లాట్లు మొత్తం అమ్మేసుకున్నా అధికారుల్లో చలనం లేకపోవడానికి కారణం దీని వెనుక అధికార జనసేన నాయకుల అండ ఉండటమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని నెలలుగా ఆర్‌అండ్‌బీ స్థలాల్లో అక్రమ కట్టడాలు సాగుతున్నాయి. జనసేనకు చెందిన ఓ మత్స్యకార నేత స్వయంగా నిర్మిస్తున్న కట్టడాలు కొన్ని ఉండగా, మొత్తం అక్రమ కట్టడాల్లో ఎక్కువ కొందరు జనసేన నాయకుల కనుసన్నల్లో సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి విలువైన ప్రభుత్వ భూముల కబ్జాల పర్వం ఇంకెంత కాలం సాగుతుందోనని చర్చ నరసాపురం ప్రాంతంలో విస్తృతంగా సాగుతోంది.

ఆర్‌ అండ్‌ బి, ఇరిగేషన్‌ స్థలాల్లో భవన నిర్మాణాలు

ఆక్రమిత ప్రభుత్వ భూముల్లో వెంచర్‌ వేసిన దృశ్యం

కన్ను పడితే కబ్జా 1
1/1

కన్ను పడితే కబ్జా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement