టెట్‌కు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
ఏలూరు (మెట్రో): జిల్లాలో ఈనెల 10 నుంచి 21 వరకు జరగనున్న ‘టెట్’ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ‘టెట్’ నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులపై మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పరీక్ష ఈనెల 10 నుంచి 21 వరకు రెండు కేంద్రాలలో నిర్వహిస్తామని చెప్పారు. పరీక్ష సమయంలో విద్యుత్‌కు అంతరాయం లేకుండా ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం ఉండేలా చూడాలని, వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణ సమయంలో అభ్యర్థుల సందేహాల నివృత్తికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలనీ డీఈఓని ఆదేశించారు.
ఏలూరు(మెట్రో): జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ప్రగతిని సాధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం రైతు ఉత్పత్తిదారుల సంఘాలు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వ్యవసాయం, అనుబంధ రంగాలలో ప్రగతిని సాగిస్తున్నామని, ఆయిల్ పామ్ అధిక విస్తీర్ణంలో సాగవుతుందన్నారు. కోకో అంతర పంటగా సాగవుతుందన్నారు. ఏలూరు జిల్లాలో కోకో, ఆయిల్ పామ్, కొబ్బరి, మామిడి, తదితర ఉత్పత్తులతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, వ్యవసాయ ఉత్పత్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లలో జిల్లా మంచి పురోగతి సాధించేలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు చర్యలు తీసుకోవాలన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): నూతన పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బ్యాంకు రుణాలు మంజూరుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి, ఇన్వెస్టర్లతో ముఖాముఖి సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయం, ఆక్వా రంగాలలో అభివృద్ధి సంతృప్తికరంగానే ఉందని, పారిశ్రామికంగా అభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనేకమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, నూతన పరిశ్రమల స్థాపనకు అనుమతులు, బ్యాంకు రుణాల మంజూరు, మౌలిక వసతుల కల్పనలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ రంగాలకు సంబంధించిన ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న పరిశ్రమల వివరాలు, కొత్తగా ప్రారంభించబోయే పరిశ్రమలు, వ్యాపారాలు గురించి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో పరిశ్రమల శాఖ ప్రగతిపై సమీక్షించారు.
భీమవరం(ప్రకాశం చౌక్): ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా కాలయాపన చేస్తుంది. 9వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు జమ చేయకుండా వారి పట్ల నిర్లక్ష్య వైఖరితో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ఇంకా జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతునే విధులకు హాజరువుతున్నారు. ఇంటి అద్దె, ఈఎంఐలకు అప్పులు చేస్తున్నారు. ఈఎంఐలు కట్టపోతే ఫైన్ వేసి మరీ వసూలు చేస్తున్నారని ఆలస్యంగా కట్టడంతో సిబిల్ స్కోర్ పడిపోయి లోను ఇచ్చే పరిస్థితి లేకుండా పొతుందని ఉద్యోగులు వాపొతున్నారు. జీతాలు కోసం ఉద్యోగులు ఎదురుచూస్తునప్పటికీ కూటమి ప్రభుత్వం జీతాలు జమ చేయకుండా రోజులు నెట్టుకొస్తోంది. అధికారంలోకి వస్తే జీతాలు ఒకటో తేదీనే జమ చేస్తామని హమీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో ఒకటి, రెండు సార్లు జీతాలు సమయానికి పడకపోతే విమర్శించిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు గత 16 నెలల పాలనలో నెలనెల జీతాలు సమయానికి జమచేయకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ, హౌసింగ్, పరిశ్రమల, సవిల్ సప్‌లై, బీసీ, సోషల్ వెల్ఫేర్, చేనేత, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, ఇరిగేషన్ తదితర శాఖలకు చెందిన 317 మంది ఉద్యోగులకు జీతాలు అందలేదు.


