కూటమికి చెంపపెట్టులా ప్రజా ఉద్యమం
బుట్టాయగూడెం: సీఎం చంద్రబాబు చేతకానితనంతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ప్రజా ఉద్యమం చేస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. మండలంలోని కృష్ణాపురంలో గురువారం రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. అయితే చంద్రబాబు సర్కారు పేద, మధ్య తరగతి విద్యార్థుల ప్రయోజనాలను పట్టించుకోకుండా మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. దీనివల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందనంత దూరమవుతుందన్నా రు. వైద్య విద్యకు ఫీజులు భరించలేనంతగా పెరిగిపోతాయని చెప్పారు. గిరిజన ప్రాంతంలో ప్రజలకు కార్పొరేట్ తరహాలో వైద్యం అందించాలనే ఉద్దేశంతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. అయితే వాటి పనులు కూడా ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయని, వాటిని పూర్తిచేయడంలో కూడా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నేత ఆరేటి సత్యనారాయణ, వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్‌రావు, పార్టీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు తాళ్లూరి ప్రసాద్, పార్టీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు బగ్గి దినేష్, నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు


