జిల్లాలోని ఆయా ఆస్పత్రులకు రూ.100 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్టు అంచనా. వీటిలో ఒక్కో ఆస్పత్రికి రూ.40 లక్షల నుంచి రూ.7 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్టు యాజమాన్యాలు చెబుతున్నాయి. వీటిని విడుదల చేయాలని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆశా పిలుపు మేరకు నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మెబాట పట్టాయి. పలు ఆరోపణలతో నెలరోజుల క్రితమే భీమవరంలోని ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో సేవలు నిలిచిపోగా తణుకులోని మరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురంలోని 25 నెట్‌వర్క్ ఆస్పత్రుల్లోను శుక్రవారం నుంచి సేవలను నిలిపివేశారు. ఆయా ఆస్పత్రుల్లో రోగులకు అవసరమైన సహకారం అందించే ఆరోగ్యశ్రీ హెల్ప్‌డెస్క్‌లు ఆరోగ్యమిత్రలు లేకుండా కనిపించాయి. ఆరోగ్యశ్రీపై ఉచిత వైద్యసేవలు పొందేందుకు వచ్చిన రోగులను ఆస్పత్రి సిబ్బంది సొమ్ములు చెల్లించిన వారికే వైద్యం అందుతుందని చెప్పడంతో పేదవర్గాల వారు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు నగదు చెల్లించి వైద్యసాయం పొందగా, చెల్లించే స్థోమత లేక మరికొందరు ఉసురూమంటూ వెనుదిరిగారు. అధికారంలోకి వచ్చాక వైద్యసేవల్ని నిర్వీర్యం చేస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం తమకు ఆరోగ్య భరోసానిస్తున్న ఆరోగ్యశ్రీని మొత్తం ఆపేయాలని చూస్తోందని పేదవర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు విడుదల చేయడం ద్వారా త్వరితగతిన సేవలు పునరిద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.