
అవిగవిగో పాపికొండలు
మరువలేని అనుభూతి
బుట్టాయగూడెం: పాపికొండల విహారం తిరిగి ప్రారంభమైయింది. గోదావరి వరదల కారణంగా సుమారు మూడు నెలల పాటు పాపికొండల యాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ప్రస్తుతం గోదావరిలో వరద తగ్గుముఖం పట్టడంతో విహారయాత్ర తిరిగి ప్రారంభించేందుకు పర్యాటక శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గండిపోచమ్మ తల్లి గుడి బోటు పాయింట్ నుంచి 23 మంది ప్రయాణికులతో బోటు ప్రయాణం ప్రారంభమైంది. అలాగే ఆదివారం ఉదయం 9 గంటలకు సుమారు 65 మంది ప్రయాణికులతో బోటు ప్రయాణం చేసినట్టు అధికారులు తెలిపారు. పాపికొండల పర్యాటక బోట్లు యథాతథంగా నడపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
15 బోట్లు సిద్ధం
గోదావరి నది ఒడ్డున ఉన్న పాపికొండలు ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా పేర్గాంచాయి. గోదావరి ప్రవాహంలో ప్రకృతి రమణీయమైన ఎత్తయిన కొండల మధ్య సాగే బోటు ప్రయాణం పర్యాటకులు అపూర్వ అనుభూతిని అందిస్తుంది. అయితే గోదావరి వరదలు పెరగడంతో జూలై నెలలో విహార యాత్రను టూరిజం శాఖ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. వరదల ప్రభావం తగ్గి నీటిమట్టం సాధారణ స్థాయికి చేరడంతో మరలా ప్రారంభించారు. పర్యాటకుల భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. బోట్లలో పూర్తిగా సాంకేతిక తనిఖీలు చేసిన తర్వాతే ప్రయాణానికి అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు. రెండు రోజుల నుంచి రెండు బోట్లు మాత్రమే సర్వీసులు అందిస్తున్నాయి. ఇదిలా ఉండగా పూర్తిస్థాయిలో సర్వీసులు నడిపేందుకు 15 బోట్లు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. విహారయాత్ర పునః ప్రారంభం కావడంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పాపికొండల మధ్య బోటు ప్రయాణం
3 నెలల అనంతరం విహారయాత్ర ప్రారంభం
వరదల కారణంగా నిలిచిన బోటు ప్రయాణాలు
వరద తగ్గుముఖంతో యాత్రకు అనుమతి
బోటుపై పాపికొండల విహారయాత్ర మరువలేని అనుభూతి. చెప్పలేని ఆనందాన్ని పొందుతాం. మూడు నెలల పాటు నిలిచిన యాత్ర పునః ప్రారంభం కావడం ఆనందదాయకం. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా బోటు ప్రయాణంతో మర్చిపోలేని తీపి జ్ఞాపకాలు పొందుతారు.
–చెరుకూరి రాజియోగి, పర్యాటకుడు, కేఆర్ పురం

అవిగవిగో పాపికొండలు