
ప్రాణం తీసిన మద్యం మత్తు
బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి దుర్మరణం
భీమడోలు: మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ అతివేగంగా వాహనాన్ని నడుపుతూ బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఆగడాలలంకకు చెందిన సిరింగి మోహనరావు (35) దుర్మరణం పాలయ్యారు. ఆదివారం సాయంత్రం గుండుగొలను పంచాయతీ పరిధిలోని వడ్డిగూడెం వద్ద దుర్ఘటన చోటుచేసుకుంది. లారీ ఢీకొన్న తర్వాత అర కిలోమీటరు మేర బైక్‌ను, మోహనరావును ఈడ్చుకెళ్లింది. వివరాలిలా ఉన్నాయి.. మోహనరావు గుండుగొలనులో చదువుకుంటున్న తన కుమారుడిని తీసుకుని వచ్చేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో ఘటనా స్థలి వద్ద వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలతో మోహనరావు అక్కడి కక్కడే కన్నుమూశారు. గ్రామస్తులు భారీ సంఖ్యలో చేరుకుని లారీ డ్రైవర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం మృతుని కుటుంబానికి న్యా యం చేయాలంటూ ఆందోళనకు దిగడంతో ట్రాఫి క్ నిలిచిపోయింది. నిడమర్రు సీఐ రజనీకుమార్, ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ ఇక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. లారీ డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని, బాఽధిత కుటుంబానికి న్యాయం చేయాలని, గుండుగొలను సమీపంలోని ఓ ఫ్యాక్టరీకి చెందిన లారీ యాజమాని వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుమారు 3 గంటలపాటు ఆందోళన కొనసాగింది. మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులతో పాటు ఎంపీపీ కనమాల రామయ్య, మాజీ ఎంపీపీ శిరిబత్తిన కొండబాబు, గ్రామపెద్దలు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. మృతుడు మోహనరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా రు. వీరితో పాటి తల్లి, నానమ్మలను రోజువారీ పనులు చేస్తూ పోషిస్తున్నాడు. ఇంటికి ఆధారమైన మోహనరావు మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.