
ఒంటరి వృద్ధులే టార్గెట్
● తణుకులో భారీ చోరీ కేసు ఛేదించిన పోలీసులు
● 10 మంది అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ ● 30 కాసుల ఆభరణాలు స్వాధీనం
తణుకు అర్బన్: తణుకులో వృద్ధురాలిని భయపెట్టి 70 కాసుల బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 10 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకుని సుమారు 30 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 26 రాత్రి స్థానిక వారణాసి వారి వీధిలో నివసిస్తున్న వాకలపూడి కనకదుర్గ నివాసంలో చోరీకి సంబంధించి ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల దర్యాప్తులో పట్టుబడిన దొంగల నుంచి రూ.16 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. తణుకు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్ వివరాలు వెల్లడించారు. ఈ భారీ చోరీ కేసులో ఎస్పీ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని, పోలీసు అధికారులు 6 బృందాలుగా ఏర్పడి మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో జల్లెడ పట్టి చైన్ లింక్ మాదిరిగా దొంగలను పట్టుకున్నారన్నారు. చోరీ సొత్తును పంచుకున్నారని, వృద్ధులు, సంపన్నుల ఇళ్లను టార్గెట్ చేసుకుని ఈ దొంగల ముఠా చోరీలకు పాల్పడుతుందని స్పష్టం చేశారు. ఈ కేసులో మరికొందరిని పట్టుకోవాల్సి ఉందని, మిగిలిన ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, తణుకు పట్టణ, రూరల్ సర్కిల్ పోలీసులు అదే పనిలో ఉన్నారన్నారు. చోరీకి సంబంధించి 10 బంగారు గాజులు, జత చెవి దుద్దెలు, జత మాటీలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అనుమానితులు ఎవరైనా కనపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ముద్దాయిలను పట్టుకోవడంలో సహకరించిన పట్టణ సీఐ ఎన్.కొండయ్య, రూరల్ సీఐ బి.కృష్ణకుమార్, తాడేపల్లిగూడెం రూరల్ సీఐ బీబీ రవికుమార్, పట్టణ ఎస్సైలు కె.శ్రీనివాస్, కె.ప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై డి.ఆదినారాయణ, రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్, అత్తిలి ఎస్సై పి.ప్రేమ్‌రాజ్ ఏఎస్సైలు ఎస్.శ్రీధర్, పి.సంగీతరావు, పి.సత్యనారాయణ, 10 మంది కానిస్టేబుళ్లను డీఎస్పీ అభినందించారు.