
అత్యవసర సేవలు బంద్
● సమ్మెలో రూరల్ పీహెచ్‌సీ వైద్యులు
● ఏలూరు జిల్లాలో 62 పీహెచ్‌సీల్లో నిలిచిన సేవలు
● ఈ నెల 3న చలో విజయవాడకు పిలుపు
ఏలూరు టౌన్: కూటమి సర్కారు నిరంకుశ... నిర్లక్ష్య ధోరణితో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు వైద్య సేవలు దూరమయ్యాయి. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తోన్న వైద్యులు విధులను బహిష్కరించారు. ఎన్నికల్లో అలవికాని హామీలు గుప్పించి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా మోసం చేసిన కూటమి ప్రభుత్వం... పీహెచ్‌సీ వైద్యులకు సైతం హామీలు ఇచ్చి మరోసారి మోసం చేసింది. పీజీ సీట్లలో కోటాకు కోత వేసిన ప్రభుత్వం, గత ఏడాది ఇచ్చిన హామీని సైతం పక్కన బెట్టి పాత విధానాన్ని తెరపైకి తేవటంతో ఏపీ పీహెచ్‌సీ వైద్యుల అసోసియేషన్ పిలుపుతో ఉద్యమబాట పట్టారు.
పీహెచ్‌సీల్లో నిలిచిపోయిన వైద్యసేవలు
ఏలూరు జిల్లా వ్యాప్తంగా 62 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా.. వాటిలో 110 మందికి పైగా వైద్యులు విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. పీహెచ్‌సీలతో పాటు 104 సంచార వాహనాల్లో గ్రామాలకు వెళుతూ ప్రజలకు వైద్య చికిత్సలను అందిస్తూ మందులు పంపిణీ చేస్తూ ఉంటారు. ప్రతీ రోజూ ఒక్కో పీహెచ్‌సీలో 60 మంది నుంచి 100 మంది వరకూ పేదవర్గాల ప్రజలకు వైద్యులు సేవలు అందిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలు దూర ప్రాంతాలకు వెళ్ళకుండా వారి గ్రామంలో పరీక్షలు చేసి మందులు అందిస్తున్నారు. సరైన సౌకర్యాలు లేకున్నా పీహెచ్‌సీ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలను చేరువ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పీహెచ్‌సీ వైద్యుల సమస్యల పరిష్కారానికి ససేమిరా అనడంతో వైద్యులు ఆందోళన బాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచీ పీహెచ్‌సీల్లో అత్యవసర వైద్యసేవలను సైతం నిలిపివేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యసేవలు నిలిచిపోయాయి.
3న చలో విజయవాడ
ఏలూరు జిల్లాలో గత పదిహేను రోజులుగా పీహెచ్‌సీ వైద్యులు దశలవారీ ఉద్యమాన్ని చేపడుతూ వస్తున్నారు. ఏపీ పీహెచ్‌సీ వైద్యుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ భవానీ, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తొలుత నల్లబ్యాడ్జీలు ధరించి నిరనస తెలుపగా.. అనంతరం ఓపీ సేవలు నిలిపివేశారు. ఆన్‌లైన్ రిపోర్టింగ్, అధికారుల గ్రూపుల నుంచి బయటకు వచ్చేశారు. 104 సంచార వైద్యశాల సేవలు ఆగిపోయాయి. గత మూడు రోజులుగా ఏలూరు వైద్య ఆరోగ్యశాఖ జిల్లా కార్యాలయం వద్ద టెంట్లు వేసుకుని నిరనస ప్రదర్శనలు చేస్తున్నారు. బుధవారం రాత్రి ఏలూరులో పీహెచ్‌సీ వైద్యులంతా కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ, పాతబస్టాండ్ సెంటర్‌లో మానవహారం నిర్మించి తమ నిరసన తెలిపారు. ఇక గురువారం నోటికి నల్లబ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలుపుతామని చెబుతున్నారు. ఈనెల 3న చలో విజయవాడ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల వైద్యులు భారీ ఆందోళన చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు.
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యసేవలను అందిస్తూ... చిత్తశుద్ధితో పనిచేస్తున్న పీహెచ్‌సీ వైద్యుల పట్ల ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి. గత ఏడాది పీజీ సీట్ల కోటాలో 20 శాతం ఇస్తామంటూ హామీ ఇచ్చి.. ఈ ఏడాది మళ్ళీ పాత విధానంలోనే 15 శాతం కోటా ఇస్తామంటే సరైన విధానం కాదు. ప్రభుత్వం మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేవరకూ ఆందోళనలు కొనసాగుతాయి.
– డాక్టర్ జ్ఞానేష్, ఏపీ పీహెచ్‌సీ వైద్యుల అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ
ప్రభుత్వం తక్షణం స్పందించి మా సమస్యలు పరిష్కరించాలి. ముఖ్యంగా పీజీ ఇన్ సర్వీసు కోటాను పునరుద్ధరించాలి. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేకంగా ట్రైబల్ అలవెన్స్‌ను మంజూరు చేయాలి. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరిస్తే సమ్మె విరమిస్తాం. లేదంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తాం.
– డాక్టర్ ఏ అశోక్ కుమార్,
వైద్యాధికారి, తాడువాయి పీహెచ్‌సీ
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సమ్మె బాట పట్టడంతో గ్రా మాల్లోని పేద మధ్యతరగతి ప్రజలు ఏదైనా రోగం వస్తే అత్యవసర వైద్యం చేయించు కోవాలంటే డాక్టర్లు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు చర్య తీసుకోవాలి.
– డాక్టర్ రామకృష్ణ, వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు, కామవరపుకోట
ఏలూరు డీఎంహెచ్‌ఏ కార్యాలయం వద్ద పీహెచ్‌సీ వైద్యుల నిరసన
ఏలూరులో పీహెచ్‌సీ వైద్యుల కొవ్వొత్తుల ర్యాలీ

అత్యవసర సేవలు బంద్

అత్యవసర సేవలు బంద్

అత్యవసర సేవలు బంద్

అత్యవసర సేవలు బంద్