
హత్య చేసి.. గోనె సంచిలో కుక్కి..
ప్రతిష్టాత్మకంగా తీసుకుని..
● వీడిన యువకుడి హత్యకేసు మిస్టరీ
● సఖినేటిపల్లిలో సురేష్ మృతదేహం లభ్యం
తణుకు అర్బన్: తణుకులో మొదట అదృశ్యం.. ఆపై హత్యగా మారి సంచలనం సృష్టించిన కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. చించినాడ గోదావరి తీరంలో పోలీసులు ఈతగాళ్ల సాయంతో చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా ఈనెల 2న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలోని చొదిమెళ్ల గ్రామ పరిధిలో తాడేపల్లిగూడేనికి చెందిన యువకుడు మడుగుల సురేష్ (25) మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. గత నెల 23న తణుకు వెళ్లిన సురేష్ తిరిగి తాడేపల్లిగూడెం రాలేదని న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజుపై అనుమానం వ్యక్తం చేస్తూ 25న తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సురేష్ సోదరి శిరీష ఇచ్చిన ఫిర్యాదుతో అదృశ్యం కేసుగా పోలీసులు నమోదుచేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో బయటపడ్డ ఆధారాలతో ముందుగా తణుకు గోస్తనీ కాలువలో, అనంతరం చించినాడ గోదావరిలో రెండురోజులపాటు గాలింపు చేపట్టగా సురేష్ మృతదేహం ఉన్న గోనె సంచి మూట గోదావరిలో లభ్యమైంది. అప్పటికే శవం కుళ్లిపోయి, పురుగులు పట్టిన పరిస్థితుల్లో ఉండగా మృతుడి చేతిపై ఉన్న పచ్చబొట్టుతోపాటు ఒంటిపై ఉన్న దుస్తుల ఆధారంగా బాధిత వర్గాలు గుర్తించిన అనంతరం శుక్రవారం పోలీసులు పంచనామా నిర్వహించి రాజోలు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు. అనంతరం కుటుంబసభ్యులకు సురేష్ మృతదేహాన్ని అప్పగించారు.
వివాహేతర సంబంధం వ్యవహారంలో..
వివాహేతర సంబంధం వ్యవహారంలో న్యా యవాది తిర్రే సత్యనారాయణరాజు పట్టణానికి చెందిన నలుగురు యువకుల సాయంతో గతనెల 23న సురేష్‌పై దాడి చేశారని, దాడి ఘటనలో సురేష్ తలకు తీవ్రగాయమైనట్టు తెలుస్తోంది. మృతి చెందాడని నిర్ధారించుకున్న అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి తణుకు నుంచి ఒక కారులో ఎక్కించుకుని చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలో పారవేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలినట్టు సమాచారం. అయితే నిందితులు అంతా ఒకే మాటపై ఉండి మృతదేహం దొరకకుండా ఉండేందుకు పోలీసులకు తప్పుగా సమాచారం ఇస్తూ వారిని ముప్పుతిప్పలు పెట్టారు. సురేష్ సెల్‌ఫోన్‌ను సైతం తాడేపల్లిగూడెంలో పారవేసి పోలీసులను తప్పుదారి పట్టించేందుకు నిందితులు పక్కా ప్లాన్ చేశారని సమాచారం. అయినా పోలీసులు తమదైన రీతిలో విచారణ చేసి చివరకు పదో రోజున మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం లభ్యం కాని పక్షంలో కేసు వీగిపోతుందనే ఉద్దేశంతో నిందితులు చాకచక్యంగా వ్యవహరించినా చివరకు మిస్టరీ వీడిందని, అయితే మృతదేహం త ర లింపులో నిందితులు విని యోగించిన కారును కూ డా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
మడుగుల సురేష్ (ఫైల్)
సఖినేటిపల్లి గోదావరి తీరంలో లభ్యమైన సురేష్ మృతదేహం ఉన్న మూట
యువకుడి అదృశ్యం ఘటన గతనెల 25 నుంచి ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో తణుకు పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.తణుకు పట్టణ స్టేషన్‌లో ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుళ్లు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ బందోబస్తుకు వెళ్లిన నేపథ్యంలో స్టేషన్‌లో సగం సిబ్బంది కూడా లేని పరిస్థితి. అయినా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తణుకు సీఐ ఎన్.కొండయ్య నేర విభాగ పోలీసుల సహకారంతో కేసును ఛేదించారు. అలాగే గతనెల 27న తణుకు వారణాసి వారి వీధిలో వృద్ధురాలిని భయపెట్టి 70 కాసుల బంగారు ఆభరణాల చోరీ కేసులో సైతం పురోగతి లభించినట్టు తెలిసింది. అనుమానితులను గుర్తించి, మహారాష్ట్రకు ప్రత్యేక నేర విభాగం సిబ్బంది వెళ్లి నిందితులను పట్టుకున్నట్టు సమాచారం. చోరీకి సంబంధించిన సొత్తును సైతం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.

హత్య చేసి.. గోనె సంచిలో కుక్కి..