
కొనసాగిన పీహెచ్‌సీ డాక్టర్ల దీక్షలు
ఏలూరు టౌన్: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు చేపట్టిన నిరసన దీక్షలు మూడో రోజు కొనసాగాయి. 20 రోజులుగా జిల్లావ్యాప్తంగా పీహెచ్‌సీల్లోని వైద్యులు దశలవారీ ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏలూరు పాతబస్టాండ్ సమీపంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన దీక్ష కొనసాగించారు. జిల్లాలోని 62 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు పోరాటం చేస్తున్నారు. ఏపీ పీహెచ్‌సీ వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా శనివారం చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. పీహెచ్‌సీ వైద్యుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ భవానీ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జ్ఞానేష్ మాట్లాడుతూ పీహెచ్‌సీ వైద్యులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఇన్‌సర్వీస్ కోటాలో కోత విధించటం దారుణమనీ, తాము ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేస్తున్నా తమ సమస్యల పరిష్కారం పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించటం సరికాదని అభిప్రాయపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించే వరకూ పోరాటాన్ని ఆపేది లేదని వైద్యాధికారులు స్పష్టం చేశారు.