
ఆంధ్రా మైసూర్ ముస్తాబు
● నూజివీడులో నేడు దసరా ఉత్సవాలు
● కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
నూజివీడు: జమీందారుల ఏలుబడిలో దసరా ఉత్సవాల నిర్వహణలో రెండో మైసూర్‌గా నూజివీడు పేరొందింది. గత నెల 22 నుంచి నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. గురువారం రాత్రి జరిగే ఉత్సవాలను తిలకించడానికి ప్రజలు భారీగా తరలిరానున్నారు. రాచరికపు కోటలకు నిలయంగా ఉన్న నూజివీడును శత్రువుల బారి నుంచి పరిరక్షించి, ప్రజలందరినీ చల్లగా చూసేందుకు జమిందారులు కోటప్రాకారంలో నిర్మించిన మహిషాసురమర్దని అమ్మవారి ఆలయం దసరా ఉత్సవాలకు ముస్తాబైంది. కోట ప్రాకారంలో ఉండటంతో కోట మహిషాసురమర్దని ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. దసరా ఉత్సవాల్లో భాగంగా విజయదశమి రోజున రాత్రి గరుడ వాహనం, ఐరావతం, బుట్టబొమ్మలు, కోలాట నృత్య ప్రదర్శనలు, చిత్ర, విచిత్ర వేషధారణలతో జోరుగా హుషారుగా ఉత్సవాలు సాగనున్నాయి. స్థానిక ఉయ్యూరు ఎస్టేట్ వద్ద జమిందారీ వారసులు జమ్మికొట్టి దసరా ఉత్సవాలను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపు రాత్రంతా పురవీధుల్లో తిరుగుతూ ప్రజల్ని రంజింపచేస్తుంది. శ్రీ కోట మహిషాసురమర్దని అమ్మవారి ఆలయంలో పోలీసు అధికారులతో ఆయుధ పూజ నిర్వహించిన అనంతరం రాత్రి 10 గంటల నుంచి అమ్మవారు హంస వాహనంపై గ్రామోత్సవానికి బయలుదేరతారు. ఈ గ్రామోత్సవంలో గరగ నృత్యం, బేతాళ సెట్టు, కర్రల మీద మనుషుల నడక, శక్తివేషాలు, కోలాటం, కత్తిసాము, కర్రసాము, నారసాల వంటి ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలో చిన్నగాంధీబొమ్మ సెంటర్ వద్ద నుంచి పెద్దగాంధీబొమ్మ సెంటర్ వరకు బొమ్మల దుకాణాలు వెలిశాయి. స్థానిక హనుమాన్‌జంక్షన్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చిన్నారుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది.
దసరా ఉత్సవాలకు ఉయ్యూరు రాజా నాంది
112 ఏళ్ల క్రితం నూజివీడులో దసరా ఉత్సవాలకు ఉయ్యూరు ఎస్టేట్ రాజా శ్రీకారం చుట్టినట్లు చరిత్ర చెబుతోంది. ఉయ్యూరు ఎస్టేట్ సంస్థానాధీశులైన రాజా రంగయ్యప్పారావువారి సంస్థాన ద్వారం గుర్రాల గేటు వద్ద ఉన్న ఆయుధాగారంలోని ఆయుధాలకు ఎస్టేట్‌లోని జమ్మిచెట్టు వద్ద పూజ చేసి దసరా ఉత్సవాన్ని ప్రారంభించే ఆనవాయితీ నాటి నుంచి నేటి వరకూ వస్తోంది. ఉయ్యూరు రాజా హయాంలో అన్ని ఎస్టేట్‌లకు చెందిన ఏనుగులు అంబారీ, ఒంటెలు, గుర్రపు స్వారీలతో పెద్ద ఊరేగింపు జరిగేది. కోలాటాలు, కత్తి సాము, గారడీలతో ఎంతో ఉత్సహ పూరితమైన వాతావరణంలో ఉత్సవాలు జరిగేవి. అమ్మవారితో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామి, కోట శివాలయం, రాజగోపాలస్వామి ఉత్సవ మూర్తులను గ్రామోత్సవం నిర్వహించేవారు. రాజా రంగయ్యప్పారావు తదనంతరం రాజా వెంకటాద్రి అప్పారావు మైసూర్ మహారాజా ఆధ్వర్యంలో జరిగే దసరా ఉత్సవాలను మైసూర్ వెళ్లి తిలకించారు. అక్కడి ఉత్సవాల్లో బుట్టబొమ్మలను చూసి మంత్రముగ్ధుడైన ఆయన ఆ తరహాలోనే బుట్టబొమ్మలను ప్రత్యేకంగా తయారు చేయించి నూజివీడులో జరిగే ఉత్సవాల్లో ప్రదర్శింపజేయడం ఆనవాయితీగా మారింది. ఈ ఉత్సవాల్లో బుట్టబొమ్మలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాజా మేకా వెంకటాద్రి అప్పారావు 1952లో ఈ దసరా ఉత్సవాల బాధ్యతను స్థానిక పెద్దలకు అప్పగించారు. దీంతో అప్పటి నుంచి పుర ప్రముఖులు స్పోర్టింగ్ క్లబ్ పేరుతో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
భారీ పోలీస్ బందోబస్తు
ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. 200 మందిని బందోబస్తు విధులకు నియమించారు. ఆలయంలో తోపులాట చోటుచేసుకోకుండా క్యూలైన్‌ల వద్ద పోలీసు సిబ్బందితో పాటు ఎన్‌సీసీ క్యాడెట్లను, ట్రిపుల్ ఐటీ సెక్యురిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 7 గంటల వరకూ లారీలు, భారీ వాహనాలను పట్టణంలోకి రాకుండా పోలీసు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఆంధ్రా మైసూర్ ముస్తాబు

ఆంధ్రా మైసూర్ ముస్తాబు