
వృద్ధులకు న్యాయ సహాయం
ఏలూరు (టూటౌన్): నేటి సమాజంలో నిరాశ్రయులైన వృద్ధుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. ఏలూరులోని పట్టణ నిరాశ్రయుల వృద్ధుల ఆశ్రమాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును నిర్వహించారు. చట్టపరంగా సీనియర్ సిటిజెన్స్‌కు ఉన్న హక్కులు, చట్టాలపై అవగాహన కలిగించారు. వృద్ధులకు అవసరమైన న్యాయ సహాయాన్ని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఉచితంగా అందిస్తుందని, ఉచిత న్యాయ సలహాలకు 15100 నెంబరులో సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాది పి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: భీమవరం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల వేతన బకాయిలు, పీఎఫ్ బకాయిలను తక్షణమే చెల్లిం చాలని, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి చెల్లబోయిన రంగారావు డిమాండ్ చేశారు. బుధవారం ఏిపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రి, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించిన సందర్బంగా చెల్లబోయిన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు ఇస్తున్న వేతనాలు అతి తక్కువగా ఉన్నా ప్రతినెలా సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల ఆర్ధిక ఇబ్బందులతో విధులు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్ సొమ్ము సైతం కార్మికుల పీఎఫ్ ఖాతాలకు జమ చేయడం లేదని ఆసుపత్రి పడకల స్థాయికి అనుగుణంగా పారిశుధ్య కార్మికులు లేక తీవ్ర పనిభారంతో అనారోగ్యం పాలవుతున్నారన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఎంప్లాయిస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
భీమవరం(ప్రకాశం చౌక్): టైమ్ బౌండ్ ప్రమోషన్లు పొరుగు రాష్ట్రాలన్నింటిలో నిరంతరం అమలు జరుగుతున్న హక్కును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్(ఏపీపీహెచ్‌సీడీఏ) ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్‌లోని డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం ఎదుట వైద్యాధికారులు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. వైద్యాధికారులు ఆర్థిక ప్రయోజనాలు కాకుండా మానవ వనరుల పరంగా టైమ్ బౌండ్ ప్రమోషన్లు తమ న్యాయమైన హక్కు అని డిమాండ్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు కరోనా మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, ప్రజల ప్రాణాలను రక్షించినప్పటికీ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వారి హక్కులు సంవత్సరాలుగా అమలు కావడం లేదని వారు గుర్తు చేశారు. ఇప్పటికే పలు సార్లు ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రిని కలిసి విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కానందున ఈ నిరసన చేపడుతున్నామన్నారు.
యలమంచిలి: గోదావరి వరదను సమర్ధంగా ఎదుర్కొంటామని నరసాపురం ఆర్డీఓ దాసి రాజు చెప్పారు. గోదావరి ఉధృతి నేపథ్యంలో కనకాయలంక కాజ్ వే మునిగిపోవడంతో బుధవారం ఆయన అధికారులతో కలసి వరద తీవ్రతను పరిశీలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడుతూ ప్రజలకు తాగునీరు ప్యాకెట్లు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా వెంటనే పై అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ గ్రంధి పవన్ కుమార్, ఎస్సై కర్ణీడి గురయ్య్ర, వీఆర్వోలు ఉన్నారు.

వృద్ధులకు న్యాయ సహాయం

వృద్ధులకు న్యాయ సహాయం