
రెడ్‌బుక్ రాజ్యాంగానికి వత్తాసు
గొంతు నొక్కే ప్రయత్నం
రాజకీయ విమర్శలపై కేసులా..
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌పై కేసు
● అసెంబ్లీలో కూటమి నేతల అనుచిత వ్యాఖ్యలపై చర్యలేవీ
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో కూటమి నేతల రెడ్‌బుక్ రాజ్యాంగంలో పోలీసులు తమవంతు పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావుపై ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఏఎస్‌ఐ బండారు యేసు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. కూటమి నేతల ఒత్తిడితో పోలీస్ అధికారులు రెడ్‌బుక్ రాజ్యాంగానికి వత్తాసు పలుకుతున్నారనే అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలను అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశ్యంతో కక్షపూరిత రాజకీయాలకు ప్రభుత్వం తెరతీసిందని అంటున్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఇంటివద్దనే టీడీపీ నేతలు, రౌడీలు అరాచకం సృష్టించగా.. కేసులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పెడుతూ వేధింపులకు గురిచేశారు. తాజాగా దూలం నాగేశ్వరరావుపైనా అక్రమ కేసు నమోదు చేసి కుట్రపూరిత రాజకీయాలకు తెరతీశారు.
రాజకీయ విమర్శలపై కేసులా
ఏపీ అసెంబ్లీలో కై కలూరు ఎమ్మెల్యే కామినేని చేసిన అసందర్భ వ్యాఖ్యలతో రాజకీయ విమర్శలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రెస్‌మీట్‌లో కై కలూరు ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలపై దూలం నాగేశ్వరరావు విరుచుకుపడ్డారు. ఇదే సందర్భంలో కై కలూరు రూరల్ సీఐ రవికుమార్‌పైనా పలు విమర్శలు, అరోపణలు చేశారు. దీనికి కౌంటర్‌గా పోలీస్ అధికారుల సంఘం నేతలు, ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు ప్రెస్‌మీట్ పెట్టారు. ఏఎస్పీ మాట్లాడుతూ... ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ జిల్లా అధ్యక్షుడిపై ‘నోటి దూల తీర్చుతామంటూ’ హెచ్చరించటంపైనా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకుల గొంతు నొక్కేందుకే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దూలం నాగేశ్వరరావు విమర్శలపై కేసులు పెట్టిన పోలీసులు, టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితోనే డ్యూటీలు చేయటం నిజం కాదా!. పోలీసులు చట్టానికి లోబడి విధులు నిర్వర్తించాలి తప్పా... రాజకీయ నేతల ఒత్తిడులతో కాదు. అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సైకో అంటూ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకున్నారా?. కూటమి నేతల చేస్తోన్న కుట్ర రాజకీయాలకు ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారు.
–కంభం విజయరాజు, చింతలపూడి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త
కూటమి నేతలు ప్రతి రోజూ ఇష్టారాజ్యంగా రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. వారిపై కేసులు పెడతారా?. నిష్పక్షపాతంగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపై ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టారాజ్యంగా అసభ్యపదజాలంతో దూషిస్తోన్న వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదు. పోలీస్ అధికారులు రాజకీయ నేతల ఒత్తిడులతో అక్రమ కేసులు పెట్టటం సరికాదు. ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను బెదిరించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
–మామిళ్ళపల్లి జయప్రకాష్, ఏలూరు సమన్వయకర్త

రెడ్‌బుక్ రాజ్యాంగానికి వత్తాసు