
మీటర్ రీడర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలి
ఏలూరు (టూటౌన్): విద్యుత్ మీటర్ రీడర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించి, విద్యుత్ సంస్థలోని నియామకాలు చేపట్టాలని ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏలూరు స్ఫూర్తి భవనంలో విద్యుత్ మీటర్ రీడర్స్ జిల్లా సమావేశం బుధవారం జరిగింది. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి.కిషోర్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు పి.జాకబ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కే శేఖర్, జిల్లా కోశాధికారి కే మల్లేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 20 ఏళ్లుగా విద్యుత్ మీటర్ రీడర్స్ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను తీసుకొస్తున్న నేపథ్యంలో మీటర్ రీడర్స్ ఉపాధి ప్రశ్నార్ధకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ మీటర్ రీడర్స్‌కు ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ నాయకులు జి.దుర్గారావు, పి.సూర్య ప్రకాష్, మురళి బాబు తదితరులు పాల్గొన్నారు.