
వరద బాధితులకు నిత్యావసరాల అందజేత
వేలేరుపాడు: వరదల కారణంగా రవాణా మార్గాలు దెబ్బతిన్న గ్రామాలలోని ప్రజలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఇన్‌చార్జ్ ఆర్డీఓ ఎం.ముక్కంటి చెప్పారు. వరద ముంపునకు గురైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలోని పలు గ్రామాల ప్రజలకు నిత్యావసరాలను ముక్కంటి బుధవారం అందజేశారు. కుక్కునూరు మండలం ఉప్పరమద్దిగట్ల, వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము, గ్రామాల్లో కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముక్కంటి మాట్లాడుతూ కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలోని రవాణా మార్గాలు దెబ్బతిన్న 28 గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు అందించామన్నారు. వేలేరుపాడు మండలంలోని 24 గ్రామాల్లోని 2511 కుటుంబాలకు 94.16 క్వింటాళ్ల కూరగాయలు, కుక్కునూరు మండలంలోని 4 గ్రామాల్లోని 563 కుటుంబాలకు 21.12 క్వింటాళ్ల కూరగాయలను బుధవారం అందించామని స్పష్టం చేశారు.