
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
ద్వారకాతిరుమల: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. గురువారం ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఈనెల 9 వరకు వైభవంగా జరగనున్నాయి. అందులో భాగంగా ఆలయాన్ని, పరిసరాలను విద్యుత్ దీప తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. దాంతో ఆలయ రాజగోపురాల సముదాయం, అనివెట్టి మండపం, కొండపైన ఘాట్ రోడ్లు పరిసర ప్రాంతాలు విద్యుత్ దీప కాంతులతో మిరమిట్లు గొలుపుతున్నాయి. అలాగే ఆలయ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన స్వామి, అమ్మవార్ల 40 అడుగుల భారీ విద్యుత్ కటౌట్ చూపరులను ఆకట్టుకుంటుంది. ఆలయంలో పుష్పాలంకరణ పనులు బుధవారం రాత్రి ప్రారంభమయ్యాయి. స్వామివారు ఉదయం, రాత్రి వేళల్లో విహరించే వాహనాలను ముస్తాబు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదిక సిద్ధమైంది. గురువారం ఉదయం 9.30 గంటలకు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేయడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు.
తణుకు అర్బన్ : తణుకులో అదృశ్యమైన తాడేపల్లిగూడేనికి చెందిన మడుగుల సురేష్ (25) కేసులో నెలకొన్న మిస్టరీ ఇంకా వీడలేదు. అదృశ్యమై పది రోజులు గడిచిపోవడం, తణుకు గోస్తనీ కాలువతో పాటు చించినాడ గోదావరిలో సైతం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఆనవాళ్లు దొరక్క కేసు కొలిక్కిరాకపోవడంతో పోలీసులు తలలుపట్టుకుంటున్నారు. ఈ కేసులో బాధితవర్గాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజుతోపాటు పట్టణానికి చెందిన మరొక నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పటికీ సురేష్ జాడ తెలుసుకోలేకపోవడం గమనార్హం.