
జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యం
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని మాతాశిశు వైద్య చికిత్స కేంద్రంలోని వైద్యులు, సిబ్బంది తీరులో మార్పు కనిపించడం లేదు. గర్భిణులు ప్రసూతికి వెళ్ళాలంటే భయంతో వణికిపోతున్నారు. ఆపరేషన్ అనంతరం కుట్లు వేస్తుండగా... కుట్లు విడిపోవటం, ఇన్ఫెక్షన్‌కు గురికావడంతో బాధిత మహిళల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ఎర్రంపల్లి గ్రామానికి చెందిన శిరీష 20 రోజుల క్రితం ఏలూరు జీజీహెచ్‌లో ఎంసీహెచ్ విభాగంలో ప్రసూతి చికిత్స కోసం చేరింది. మహిళ శిరీషకు పరీక్షల అనంతరం ఆపరేషన్ చేయగా...తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నారు. కొద్దిరోజుల అనంతరం బాధిత మహిళకు అనారోగ్యంగా ఉండడంతో ఈ విషయాన్ని వైద్య సిబ్బందికి చెప్పారు. శస్త్రచికిత్స చేసిన వైద్యురాలు రావడంతో తనకు ఇబ్బందిగా ఉందని చెప్పగా... ఆమె పొట్టపై చెయ్యి వేసి అదమగానే కుట్లు విడిపోయి మహిళ అనారోగ్యానికి గురైంది. కుట్లు వేసిన ప్రాంతంలో ఇన్‌ఫెక్షన్ రావటంతో బయటకు వెళ్ళి వేరే హాస్పిటల్‌లో చికిత్స పొందుతామని చెప్పినా వైద్యులు, సిబ్బంది వినలేదని బాధిత మహిళ వాపోయింది. బాధిత మహిళ తల్లి అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళింది. వారు డిశ్చార్జ్ చేయాలని చెప్పినా ఎంసీహెచ్ విభాగం వైద్యులు నిర్లక్ష్యంగా ఉన్నారని తెలిపారు.