
దిగుబడిపై దోమ‘పోటు’
మండవల్లి: వరి పంటను ఆశిస్తున్న పురుగులు, తెగుళ్లతో దిగుబడులు తగ్గుతున్నాయి. సుడిదోమ వరి పంటను ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. వివిధ రకాల వైరస్ వ్యాధులను కారణమవుతోంది. దీని నివారణకు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
గోధుమ రంగు సుడి దోమ: గోధుమ రంగు దోమ నీటి వసతి గల ప్రాంతంలో పంటను ఎక్కువగా ఆశిస్తుంది. తల్లి పురుగులు గోధుమ వర్ణం నుంచి ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి.
నష్టం: పిల్ల, తల్లి దోమలు కాండంలోని పోషకాలు సరఫరా చేసే కణజాలం నుంచి రసాన్ని పీల్చడం వల్ల పంట క్రమేపి పసుపు రంగుకు మారుతుంది. దీంతో ఎదుగుదల కోల్పోయి గిడస బారిపోతుంది. ఆలస్యంగా పిలకలు వేస్తాయి. అలాగే పిలకల నుంచి వచ్చిన వెన్నులో గింజలు సరిగా రావు. తెల్ల మచ్చ దోమల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వెన్నును కూడా ఆశిస్తాయి. ఎక్కువ విస్తీర్ణంలో సుడి తెగులులా వ్యాపించడంతో పొలం అంతా ఎండిపోతుంది. నత్రజని ఎరువులు ఎక్కువ మోతాదులో వాడటం, పొటాష్ ఎరువులు వాడకపోవడం, నీటి యాజమాన్య పద్ధతులు సరిగా పాటించకపోవడం వల్ల ఈ దోమ వ్యాపిస్తుంది.
యాజమాన్యం: దోమలను తట్టుకునే రకాలను సాగు చేయాలి. ఇంద్ర(ఎంటీయూ 1061), శ్రీ ధ్రుతి (ఎంటీయు 112), చంద్ర (ఎంటీయూ 1153) తరంగిణి రకాలు సాగుచేయాలి.
సుడులు సుడులుగా ఎండిపోవడాన్ని సుడితెగులు అని పిలుస్తారు. దోమ ఉధృతి ఎక్కువగా ఉంటే సుడులు ఒకదానితో ఒకటి కలిసి చేనంతా ఎండిపోతుంది. అలాంటి పరిస్థితులో దిగుబడి తగ్గుతుంది.
తెల్ల వీపు మచ్చ దోమ: దోమ శరీరం తెల్లగా ఉండి ఉదరం మాత్రం నల్లగా ఉంటుంది. రెక్కల మధ్య స్పష్టమైన తెల్లటి మచ్చ ఉంటుంది. ఈ కారణంగా దీనిని తెల్ల వీపు మచ్చ దోమ అంటారు.
నష్టం: పిల్ల, తల్లి దోమలు కాండంలోని మొక్కలకు పోషకాలు సరఫరా చేసే కణజాలం నుంచి రసాన్ని పీల్చడం వల్ల మొక్కలు పసుపు రంగుకు మారి, ఎదుగుదల కోల్పోయి గిడసబారి పోతాయి. ఆలస్యంగా పిలకలు వేస్తాయి. పిలకల నుంచి వచ్చిన వెన్నులో గింజలు సరిగా రావు. తెల్ల మచ్చ దోమ వల్ల ఎక్కువ విస్తీర్ణంలో సుడి తెగులు వ్యాపించి, పొలం అంతా ఎండిపోతుంది.
● నత్రజని ఎక్కువ మోతాదులో వాడటం, పొటాష్ ఎరువులు వాడకపోవడం, నీటి యాజమాన్యం సరిగా లేకపోవడం ఉధృతికి కారణాలు
● దోమ నివారణకు అంకురం ఏర్పడే దశలో కార్బోప్యూరాన్ 3జీ గుళికలు 10 కిలోలు ఒక ఎకరానికి వేయాలి.

దిగుబడిపై దోమ‘పోటు’

దిగుబడిపై దోమ‘పోటు’