
బుడతడే గానీ ఘటికుడు
పాలకొల్లు సెంట్రల్: ఈ బుడతడు.. ప్రపంచంలో 78 దేశాల జాతీయ జెండాలను గుర్తిస్తాడు. తన టాలెంట్‌తో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు. పాలకొల్లు పట్టణంలోని 18వ వార్డు పిన్నివారి వీధిలో ఉంటున్న శ్రిఖాకొళ్లపు రాజేష్, లలిత దంపతుల పెద్ద కుమారుడు జెష్విన్ ప్రసాద్. లలితకు చదువుపై మక్కువ కావడంతో పిల్లాడిని కూడా అలాగే తీర్చిదిద్దాలనే సంకల్పంతో అతనికి ఆరు నెలలు వచ్చేసరికి ఇతర దేశాల జాతీయ జెండాలను చూపిస్తూ శిక్షణ ఇచ్చేది. జాతీయ జెండాలతో పాటు, వాహనాలు, జంతువులు, పండ్లు, పక్షులు ఇలా 300 పదాల వరకూ నేర్పించారు. ఏదైనా వస్తువు పేరు, ఆట పేరు, వ్యక్తుల పేర్లు చెపితే వాటిని చూపిస్తాడు. ఇంగ్లీషు, తెలుగులో చెబుతాడు. పిల్లాడికి నేర్పించేందుకు ప్రత్యేక కార్డులు తయారుచేశారు. జెస్విన్ టాలెంట్‌ను చిత్రీకరించి గిన్నిస్ బుక్ ఇంటర్నేషనల్ రికార్డ్స్, సూపర్ టాలెంటెడ్ కిడ్ పోటీలకు దరఖాస్తు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పిల్లాడి ప్రతిభను గుర్తిస్తూ ప్రశంసాపత్రాన్ని పంపించారు.