
నేవీ డిపోపై గిరిజన పోరు
గిరిజనుల అభిప్రాయానికి విలువిచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
నేవీ ఆయుధ డిపోను వ్యతిరేకిస్తున్నాం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గిరిజనులు మళ్లీ పోరు బాట పట్టారు. ప్రశాంత జీవనం ఉన్న మా పల్లెల్లో నేవీ ఆయుధ డిపో వద్దంటూ తీవ్రస్థాయిలో నిరసన గళం విప్పారు. మూడుసార్లు నిర్వహించిన గ్రామసభల్లో ఆయుధ డిపో వద్దంటూ తీర్మానం చేశారు. అయినా సర్కారు మొండిగా ముందుకెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. ఏలూరు జిల్లాలో తలపెట్టిన ఈ నేవీ ఆయుధ డిపోపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రామసభలో గిరిజనులు వ్యతిరేకించారు. దీంతో అప్పట్లో ఉన్నతాధికారులు ప్రజాభీష్టం మేరకు ఆ ప్రాజెక్టు ప్రతిపాదనల్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. కూటమి సర్కారులో మళ్లీ ఆ ఆయుధ డిపో ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెం ప్రాంతంలో 1,166 ఎకరాల భూమిని సేకరించి నేవీ ఆయుధ డిపో ఏర్పాటు చేస్తామని ఎంపీ పుట్టా మహేష్‌యాదవ్ చేసిన ప్రకటనతో గిరిజనులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనిని నిరసిస్తూ గిరిజనులు ర్యాలీకి పిలుపునిస్తే సెక్షన్–30 అమలు చేసి ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నేవీ డిపో ఏర్పాటుపై ఎంపీ సమావేశం
గత వారం ఎంపీ పుట్టా మహేష్‌యాదవ్ ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలిసి కలెక్టరేట్‌లో నేవీ డిపో ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. 1,166 ఎకరాల భూమి సేకరించాలని, 30 ఎకరాల్లో డిపో ఏర్పాటు, మరికొంత స్థలంలో ఆస్పత్రి, స్కూల్, అధికారుల నివాసాలు ఉంటాయని, 2,500 మందికి పైగా స్థానికులకు ఉద్యోగాలిస్తామని ప్రజలకు నచ్చజెప్పాలని ఎంపీ సూచించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే నేవీలో స్థానికంగా ఉద్యోగాలు ఎలా వస్తాయనే వాదనను గిరిజనులు తెరపైకి తెస్తే.. అధికారుల నుంచి స్పందన లేదు. తాజాగా గ్రామసభతో సంబంధం లేకుండా భూసేకరణకు సమాయత్తం అవుతుండటంపై గిరిజనులు, నేవీ ఆయుధ డిపో వ్యతిరేక పోరాట వేదిక (వామపక్షాలు) నేతలు పోరుబాట పట్టారు. ఆయుధ డిపో వద్దంటూ గత మంగళవారం ఆందోళన నిర్వహించారు. పోలీసు అధికారులు జీలుగుమిల్లి, టి.నర్సాపురం మండలాల్లో సెక్షన్–30 అమలు చేసి నిరసన ర్యాలీలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గిరిజన, వామపక్ష నేతలను గృహనిర్బంధం చేశారు. మడకంవారిగూడెంలో నిరసనకారులకు, పోలీసులకు తోపులాట జరిగింది.
జీలుగుమిల్లి మండలం గిరిజన ప్రాంతం. 1,166 ఎకరాల్లో నేవీకి సంబంధించి ఆయుధ తయారీ డిపోను ఏర్పాటు చేయడానికి ఏలూరు జిల్లాలో గిరిజన ప్రాంతంలో భూములు గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. జీలుగుమిల్లి మండలంలోని వంకావారిగూడెం, రమణక్కపేట, దాట్లగూడెం, కొత్తచీమలవారిగూడెం, మడకంవారిగూడెం గ్రామాల పరిధిలో ఈ పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని అప్పటి అధికార యంత్రాంగం నిర్ధారించడంతో నేవీ ఉన్నతాధికారులు వచ్చి ఆ భూముల్ని పరిశీలించారు. దీనిపై 2023లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రామసభ నిర్వహించగా నేవీ డిపో ఏర్పాటును గిరిజనులు వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం ప్రజల అభీష్టానికి అనుగుణంగా పనిచేస్తుందని, అందువల్ల ఆయుధ డిపో ప్రతిపాదనలను నిలిపేస్తున్నామని ఉన్నతాధికారులు ప్రకటించారు. గతేడాది కూటమి ప్రభుత్వం రాగానే ఆయుధ డిపో వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రధానంగా ఎంపీ పుట్టా మహేష్‌యాదవ్ వ్యక్తిగత ఆసక్తితో వేలాదిమంది గిరిజనులు వ్యతిరేకించినా ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని హడావుడి మొదలుపెట్టారు. దీనిలో భాగంగా గతేడాది అక్టోబర్ 27న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసుల నేతృత్వంలో గ్రామసభ నిర్వహించి అందరికీ ఉద్యోగాలు వస్తాయని, ఎలాంటి సమస్యా ఉండదని, ఉద్యోగాలన్నీ స్థానికులకే నేవీ ఇస్తుందంటూ రకరకాల మాటలతో నచ్చజెప్పాలని ప్రయత్నించారు. అయినా గిరిజనులు, ప్రజాసంఘాల వారు తీవ్రంగా వ్యతిరేకించారు. తరువాత మరోసారి గ్రామసభ నిర్వహిస్తే నేవీ డిపో వద్దంటూ ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పేరుతో వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం మండలాల్లోని గిరిజనులు ఏజెన్సీకి దూరమయ్యారని, ఈ పరిశ్రమ పేరుతో జీలుగుమిల్లి మండలంలోని గిరిజనులను కూడా తరిమివేయవద్దంటూ నిరసన వ్యక్తం చేశారు.
మూడుసార్లు గ్రామసభల్లో వద్దన్నా.. సర్కారు హడావుడి
ఏలూరు జిల్లాలో 1,166 ఎకరాల భూసేకరణపై దృష్టి
డిపో ఏర్పాటు చేసి తీరతామన్న ఎంపీ పుట్టా మహేష్ ప్రకటనతో రగడ
సెక్షన్–30తో గిరిజనుల ఉద్యమాన్ని అణచాలని ప్రయత్నాలు
ప్రజాభీష్టం మేరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనల నిలిపివేత
కూటమి సర్కారులో మళ్లీ గిరిజనుల్ని తరిమేసే ప్రణాళిక
జీలుగుమిల్లి మండలంలో నేవీ ఆయుధ డిపోను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే మూడుసార్లు గ్రామసభల ద్వారా డిపో ఏర్పాటు చేయవద్దని తీర్మానం చేశారు. భూసేకరణ జరిగిందని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పడం అబద్ధం. గ్రామసభ జరగకుండా భూసేకరణ ఎలా చేస్తారు? ప్రజల అభిప్రాయాలను గౌరవించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి.
– ఎ.రవి, సీపీఎం జిల్లా కార్యదర్శి

నేవీ డిపోపై గిరిజన పోరు