
దొంగలు బాబోయ్ దొంగలు
● జిల్లాలోకి మధ్యప్రదేశ్, రాజస్థాన్ గ్యాంగ్
● వరుస చోరీలతో ప్రజలు బెంబేలు
● అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
తణుకు అర్బన్ : చీకటిపడితే చాలు ఇంటి తలుపు లు భద్రంగా వేసుకున్నా దొంగల భయంతో ప్ర జలు ఆందోళన చెందుతున్నారు. దాడులు చేసి కొందరు, భయపెట్టి మరికొందరు దొంగలు దొరికినకాడికి దోచుకుపోతూ బెంబేలెత్తిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లతో పాటు ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధుల ఇళ్లపై తెగబడుతూ చోరీలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నెల రోజుల వ్యవధిలో జరిగిన పలు చోరీ సంఘటనలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
భయాందోళనలో వృద్ధులు
ఇటీవల దొంగల ప్రస్తావన వస్తుండటంతో ఒంటరిగా ఉంటున్న వృద్ధులు భయాందోళన చెందుతున్నారు. దొంగలు డబ్బు, ఆభరణాలు అపహరించడంతో పాటు దాడులు చేయడంతో భయపడుతున్నారు. ము ఖ్యంగా దొంగలు బంగారు ఆభరణాలను దోచుకుంటున్నారు. ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో దొంగలు వీటిపై దృష్టి సారించారు. తణుకులో వాచ్‌మెన్‌ను తీవ్రంగా గాయపరచడంతో దుకాణాలు, సంపన్నుల ఇళ్లకు వాచ్‌మెన్‌లుగా ఉన్న వృద్ధులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు.
చోరీల్లో కొన్ని..
● తణుకులో ఈనెల 26న రాత్రి వృద్ధురాలు ఒంటరిగా ఉన్నారన్న పక్కా సమాచారంతో ఇంట్లోకి చొరబడి 70 కాసుల బంగారు ఆభరణాలు, రూ.70 వేల నగదు దోచుకుపోయా రు. దొంగలను చూసి భయపడిన వృద్ధురాలు తననేమీ చేయవద్దని ఇంట్లో దాచుకున్నవి, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు సైతం స్వయంగా ఇవ్వాల్సిన పరిస్థితి.
● ఈనెల 23న రాత్రి జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ముగ్గురు దొంగలు ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతుల ఇంట్లోకి ప్రవేశించి వారిపై దాడి చేసి, కాళ్లూ చేతులు కట్టి అందిన కాడికి దోచుకుపోయారు.
● ఈనెల 20న రాత్రి తణుకు సజ్జాపురంలోని జ్యూపిటర్ ఎగ్ ట్రేడర్స్ కార్యాలయంలో విధు ల్లో ఉన్న వాచ్‌మెన్‌ను తీవ్రంగా గాయపరిచి రూ.లక్ష నగదు దోచుకున్నారు.
● ఈనెల 15న ఏలూరులో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న మహిళపై ఒక అగంతకుడు కత్తితో తీవ్రంగా దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయాడు.
పోలీసుల హెచ్చరికలు
జిల్లాలో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌కు ఆరుగురు అంతర్జాతీయ దొంగల ముఠా సంచరిస్తున్నట్టు సమాచారం ఉందని పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ నెలలో సదరు గ్యాంగ్ నెల్లూరు జిల్లా కావలి, కాకినాడ జిల్లా పత్తిపాడు, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో చోరీలకు తెగబడిందని చెబుతున్నారు. వీరంతా తక్కువ అద్దె ఉన్న లాడ్జీల్లో తలదాచుకుంటూ పగలు రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు నేరాలకు పాల్పడుతున్నారని, అనుమానాస్పదంగా వ్యవహరించే వారి సమాచారాన్ని 112కి ఫోన్ చేసి తెలియజేయాలని పోలీసులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా పోలీసు అధికారులు రాత్రిళ్లు ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.