
9 ఏళ్లుగా నిలిచిన రిజిస్ట్రేషన్లు
● 138 ఎకరాల విస్తీర్ణంలో ఆస్తులపై చిక్కుముడి
● నూజివీడువాసుల ఇబ్బందులు
నూజివీడు: నూజివీడు నడిబొడ్డున ఉన్న 138 ఎకరాల్లోని నివేశన స్థలాలు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్‌లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరగక పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిన పట్టణంలోని గ్రామకంఠం భూమి రిజిస్ట్రేషన్‌లు ఇప్పటికీ జరగడం లేదు. వక్ఫ్‌బోర్డు సూచనతో అప్పట్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇష్టారాజ్యంగా పట్టణంలోని 450/1 సర్వే నంబర్‌లో 138 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గ్రామకంఠం భూమి రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. వక్ఫ్‌బోర్డుకు చెందిన భూమి ఏమైనా ఉంటే అంతవరకు చూసుకోవాలే తప్ప 138 ఎకరాల రిజిస్ట్రేషన్‌ను నిలుపుదల చేయించడమేమిటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అవసరానికి అక్కరకు రాకుండా..
సర్వే నంబర్ 450/1లో ఉన్న భూమి ప్రైవేటు గ్రామకంఠం భూమి కాగా వందలాది గృహాలు, అపార్ట్‌మెంట్లు, ఖాళీ స్థలాలు ఉన్నాయి. రిజిస్ట్రే షన్లు నిలిపివేయడంతో క్రయవిక్రయాలు జరగక ఆస్తి అవసరానికి అక్కరకు రావడం లేదని ఈ ప్రాంతవాసులు అంటున్నారు. ఆర్థిక కష్టాలు ఎదురైతే అప్పులు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు.
ఎందుకు నిలిపివేశారంటే...
పట్టణంలోని కోనేరుపేట సమీపంలో వక్ఫ్‌బోర్డుకు చెందిన 2.50 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నించవచ్చని, దానిని ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయవద్దని వక్ఫ్ బోర్డు ఉన్నతాధికారులు 2016లో రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీకి లేఖ రాసింది. దీంతో ఆ సర్వే నంబర్‌లోని 138 ఎకరాల మొత్తం విస్తీర్ణంలోని స్థలాలన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయడం నిలిపివేశారు.
మాజీ ఎమ్మెల్యే అప్పారావు చొరవతో..
రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు అప్పట్లోనే వక్ఫ్‌బోర్డు సీఈఓతో మాట్లాడి వారి తాలూకా భూమికి సబ్‌డివిజన్ చేయించమని తహసీల్దార్‌కు లేఖ పెట్టించారు. దీంతో రెవెన్యూ అధికారులు సబ్ డివిజన్ చేసి వక్ఫ్‌బోర్డు భూమికి సర్వే నంబర్ 450/7గా ఇచ్చి అందులో 79 సెంట్లు భూమి ఉన్నట్టు ఉత్తర్వులను తిరిగి పంపారు. ఇది జరిగి ఏడున్నరేళ్లు గడిచినా ఇప్పటికీ చలనం లేదు. భూములను రిజిస్ట్రేషన్ చేయాలని ఓ న్యాయవాది హైకోర్టుకు కూడా వెళ్లారు. ఇప్పటికై నా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పట్టించుకుని సమస్యను పరిష్కరించాలని పట్టణవాసులు కోరుతున్నారు.