
శ్రీవారి క్షేత్రం.. భక్తజన సంద్రం
ద్వారకాతిరుమల: చినవెంకన్న దర్శనంతో భక్తజన మది పులకించింది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు కావడంతో శనివారం వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అలాగే దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనక దుర్గమ్మను దర్శిస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన భవానీ దీక్షాదారులు, తిరుగు ప్రయాణంలో పెద్ద ఎత్తున ఈ క్షేత్రానికి విచ్చేశారు. దాంతో కొండపైన, ఆలయ పరిసరాలు కళకళలాడాయి. మొక్కుబడులు చెల్లించే భక్తులతో కల్యాణకట్ట ప్రాంతం నిండిపోయింది. దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో కిక్కిరిశాయి. స్వామి దర్శనం తరువాత ఉచిత ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోకి చేరుకుని సెల్ఫీలు, ఫొటోలు దిగి సందడి చేశారు. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.

శ్రీవారి క్షేత్రం.. భక్తజన సంద్రం