
ఉద్యోగుల సమస్యలు పట్టని ప్రభుత్వం
ఏలూరు (మెట్రో): రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూటమి సర్కారు స్పందించాలని రెవెన్యూ అసోసియేషన్ నాయకులు అన్నారు. శనివారం స్థానిక రెవెన్యూ అసోసియేషన్‌లో దివంగత నాయకులు తోట సుధాకర ప్రసాద్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు పీఆర్‌సీ కమిషన్ వేసి తక్షణమే బకాయిలు చెల్లించాలని, ఒక్క డీఏని కూడా విడుదల చేయకపోవడం చూస్తుంటే ఉద్యోగులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోందన్నారు. ఉద్యోగుల సమస్యలపై స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు అసోసియేషన్ కోసం పాటుపడిన తోట సుధాకర ప్రసాద్‌ను ఉద్యోగులు స్మరించుకోవాలన్నారు. ప్రజాసేవకు అంకితం కావాలన్నారు. తహసీల్దార్లు రెవెన్యూ ఉద్యోగులందరితో కలిసి ఒక జట్టుగా ఉండాలన్నారు. అధికారులు టీసీలు, వీడి యో కాన్ఫరెన్స్‌లు వారం అంతా పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం సరిపడా సిబ్బందిని, శిక్షణ, నిధులు, సమయం ఇస్తే ఇప్పటికన్నా మెరుగైన, వేగవంతమైన, పారదర్శకమైన పాలనను ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు కె.రమేష్‌కుమార్, కార్యదర్శి ప్రమోద్‌కుమార్, ఆర్.వెంకటరాజేష్, రవిచంద్ర, స్వామి, రాజారత్నకుమార్, తోట కామాక్షి, సుధాకర ప్రసాద్ పాల్గొన్నారు.