
పండగ వేళా పస్తులే!
సమ్మెకు వెనకాడబోం
ఉద్యోగ భద్రత కల్పించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సమగ్ర శిక్షా అభియాన్‌లో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు కూటమి ప్రభుత్వం నిర్వాకంతో ఆకలితో అలమటిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా జీతాలు సక్రమంగా రాక కుటుంబంతో సహా పస్తులు ఉండాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆగస్టు నెల జీతాలు ఇప్పటికీ వారి బ్యాంకు ఖాతాల్లో పడలేదు. అలాగే సెప్టెంబర్ నెల జీతాల విడుదలపై కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో వీరు దసరా పండగ వేళ కూడా ప్రభుత్వం తమను పస్తులు పెడుతుందా అనే ఆవేదన చెందుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో సుమారు 1,000 మంది..
సమగ్ర శిక్షాలో ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ వంటి పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్స్, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు, క్లస్టర్ రీసోర్స్ పర్సన్లు, పీఈటీలు, ఫిజియోథెరపిస్టులు, సైట్ ఇంజనీర్లు, మెసెంజర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవ ర్లు వంటి అన్ని వర్గాలకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 1,000 మంది ఉన్నారు. వీరందరికీ కలిపి ఒక నెల వేతనం సుమారుగా రూ.7 కోట్లు ఉంటుంది. ఆగస్టు నెల జీతాలు ఇప్పటికీ విడుదల చేయకపోవడం, సెప్టెంబర్ నెల జీతాలపై స్పష్టత ఇవ్వకపోవడం వీరిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
మినిట్స్ అమలుకు డిమాండ్ : తమ డిమాండ్ల సాధన కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు గత ప్రభుత్వ హయాంలో దాదాపు 21 రోజులు సమ్మె చేశారు. ఆ సమయంలో ప్రభుత్వం వీరిని చర్చలకు పిలిచి వీరి డిమాండ్లను పరిష్కరించడానికి సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వ ప్రతినిధులు, సమగ్ర శిక్ష రాష్ట్ర ఉన్నతాధికారులు వీరితో చర్చించి మినిట్స్ రూపొందించారు. దాని ప్రకారం వారి గౌరవ వేతనాన్ని 23 శాతం పెంచడానికి అంగీకరించి ఆ మేరకు పెంచిన వేతనాలను అమలు చేసింది. అయితే హెచ్‌ఆర్ పాలసీ అమలుకు, మినిమమ్ టైమ్ స్కేల్ వర్తింప జేయడానికి గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి, పీఎఫ్ అమలు చేయడానికి, జాబ్ చార్ట్ తయారు చేయడానికి, సమగ్ర శిక్షా ఉద్యోగ నియామకాల్లో వీరికి వెయిటేజీ ఇవ్వడానికి, గత అవకాశాలను పరిశీలించడానికి కమిటీలు వేయడానికి అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈలోపు ఎన్నికలు రావడంతో ఆ మినిట్స్ అమలు కాలేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేష్ వీరి డిమాండ్లు సమంజసమైనవేనని వాటిని తమ ప్రభుత్వం వచ్చి న తరువాత తప్పకుండా పరిష్కరిస్తామని స్పష్టమైన హామీని కూడా ఇచ్చినట్టు సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఆమోదించిన మినిట్స్‌ను అమలు చేయాలని అప్పట్లో నారా లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్‌లో సైతం ట్వీట్ చేసి సమగ్రశిక్ష ఉద్యోగులను ఆకర్షించారు. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఇప్పటివరకూ తమ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం దారుణమని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీతాలు రాక సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల ఆకలి కేకలు
ఎన్నికల్లో హామీ ఇచ్చిన మినిట్స్ అమలు చేయాలని డిమాండ్
ఆగస్టు నెల జీతం బకాయి సుమారు రూ.7 కోట్లు
ఉమ్మడి జిల్లాలో సుమారు వెయ్యి మంది కాంట్రాక్టు ఉద్యోగులు
గత ప్రభుత్వం ఆమోదించిన మినిట్స్ తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకూ ఆయన స్పందించకపోవడం దారుణం. అక్టోబర్ 12లోపు మా డిమాండ్లు పరిష్కరించకపోతే విజయవాడలో జరిగే ఆవిర్భావ సభలో సమ్మెకు కార్యాచరణ రూపొందిస్తాం.
– వాసా శ్రీనివాసరావు, సమగ్ర శిక్షా ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్
సమగ్ర శిక్షాలో పని చేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మా పని వేళలు, బాధ్యతలకు సంబంధించి స్పష్టత లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. కచ్చితమైన జాబ్ చార్ట్, పని సమయాలపై మార్గదర్శకాలు జారీ చేయాలి. హెచ్‌ఆర్ పాలసీ, పీఎఫ్ వర్తింపజేయాలి.
– వినోద్, సమగ్ర శిక్షా ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు

పండగ వేళా పస్తులే!

పండగ వేళా పస్తులే!

పండగ వేళా పస్తులే!