
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సరికాదు
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని నాలుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తొలివిడతలో పీపీపీ పద్ధతిలో నిర్వహించేలా టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయటం సరికాదని, దీనిపై పునరాలోచన చేయాలని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆల్తి శ్రీనివాస్ అన్నారు. శనివారం వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో డీఆర్వో విశ్వేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో ప్రజలు తీవ్రంగా నష్టపోతారనీ, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించటం సరికాదన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించి, ప్రారంభించారని గుర్తుచేశారు. ఆయా కాలేజీల్లో 2023–24లో ఎంబీబీఎస్ తరగతులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. ఒక్కో కళాశాలలో 450 మంది వైద్య విద్య అభ్యసిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు తన 15 ఏళ్ల ముఖ్యమంత్రి ప్రస్థానంలో ఏనాడైనా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని అయినా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి, న్యాయవాది మున్నుల జాన్‌గురునాథ్, ఉంగుటూరు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు నిమ్మల రాము, దెందులూరు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు యర్రా సురేష్, జిల్లా లీగల్ సెల్ సభ్యులు కడిమి మోహనచంద్ర తదితరులు ఉన్నారు.