
నేవీ డిపోతో ఆదివాసీలకు ఇక్కట్లు
ఏలూరు (టూటౌన్): ఏజెన్సీ ప్రాంతంలో ప్రాజెక్టులు, ఫ్యాక్టరీల వల్ల ఆదివాసీలకు ఇక్కట్లు తప్ప వని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సీపీఎంఎల్ (న్యూడెమోక్రసీ) జిల్లా నాయకులు ఎస్.రామ్మోహన్ మండిపడ్డారు. శనివారం స్థానిక అన్నే వెంకటేశ్వరరావు భవనంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నేవీ ఆయుధ డిపోకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెంలో నిర్మించ తలపెట్టిన నేవీ ఆయుధ డిపోని వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. దీని వల్ల ఐదు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడతారని, ఏడాదికి రెండు పంటలు పండుతున్న భూములను సేకరించడం దుర్మార్గమన్నారు. జిల్లాలోని కొద్దిపాటి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలను కాలరాస్తున్నారన్నారు. పీసా గ్రామసభల ద్వారా ప్రజలంతా ఏకగ్రీవంగా తిరస్కరించిన ఆయుధ డిపోకు తక్షణం భూసేకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏకగ్రీవంగా తిరస్కరించిన నావికా ఆయుధ డిపోకు తక్షణమే భూసేకరణ నిలిపివేయాలని కోరారు. ఏపీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తెల్లం దుర్గారావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు కారం దారయ్య, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు ఈ.భూషణం అధ్యక్షత వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.