
నీట మునిగి కుళ్లుతున్న వరి
ఆకివీడు: ఖరీఫ్ పంట సాగుకు మళ్లీ ముంపు బెడద తప్పడంలేదు. ఇటీవల కురిసిన వర్షానికి పలు గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లోని పంట నీట మునిగింది. కొల్లేరు తీరంలోనూ, ఉప్పుటేరు, వెంకయ్య వయ్యేరు పంట కాల్వకు చేర్చి, చినకాపవరం డ్రెయిన్ ప్రాంత ఆయుకట్టు ముంపునకు గురవుతోంది. మండలంలో అధికారిక లెక్కల ప్రకారం 250 ఎకరాల్లో పంట పూర్తిగా నీట మునిగి పనికిరాకుండా పోయింది. మరి కొన్ని ఎకరాల్లో పంట నీట మునిగి ఉంది. గోదావరి వరద, ఎర్రకాలువ, తమ్మిలేరు, బుడమేరు పొంగడంతో ఈ ప్రాంతానికి ఏ క్షణంలోనైనా వరద వచ్చే ప్రమాదం ఉందని రైతులు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఉప్పుటేరు గుండా ముంపు నీరు భారీగా సముద్రంలోకి చొచ్చుకుపోతోంది. ఉప్పుటేరులో రైల్వే ఖానాల వద్ద, బైపాస్ వంతెన నిర్మాణం వద్ద మేటలు వేయడంతో నీటి ప్రవాహానికి కొంత ఇబ్బంది కరంగా ఉంది. ముంపు తీవ్రత అధికంగా ఉంటే మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట నీట మునిగే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.