
జూనోటిక్ వ్యాధుల రక్షణ ఇలా..
రేబిస్ లక్షణాలు
రేబిస్ వ్యాప్తిని నిరోధించాలి
జంగారెడ్డిగూడెం: రేబిస్ అనేది ఒక ప్రాణాంతక జూనోటిక్ వ్యాధి. అంటే ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. ముఖ్యంగా కుక్కలు, పిల్లుల్లో రేబిస్ వైరస్ కారణమవుతుంది. ఈ వ్యాధి ఎన్‌సెఫాలైటిస్ (గుర్తింపు లోపం), మానసిక స్థితి మార్పులకు దారితీస్తుంది. ఇది చివరకు ప్రాణాంతకం అవుతుంది. సెప్టెంబర్ 28న ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా రేబీస్ వ్యాప్తి, నివారణ చర్యలపై కథనం.
రేబిస్ వ్యాధి వ్యాప్తి
● రేబిస్ వ్యాధి ప్రధానంగా వైరస్ సోకిన జంతువుల గోరు, దంతాలు లేదా ముక్కు ద్వారా వ్యాపిస్తుంది.
● కుక్కలు, పిల్లులు లేదా ఇతర రేబిస్–సోకిన వన్య జంతువులు కరిచినప్పుడు రేబిస్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
● రక్తంలోకి రేబిస్ వైరస్ ప్రవేశించి, నాడీ వ్యవస్థ ద్వారా మెదడుకు చేరి తీవ్ర నాడీ సంబంధిత రుగ్మతలను కలిగిస్తుంది.
ఇతర పశువుల్లో...
● మేత తినకపోవడం, డిప్రెషన్, డల్‌నెస్, కనుపాప పెద్దదవడం, కళ్లు వెంబడి నీరు కారడం, చొంగ, కదలికలో మార్పు, నడవలేకపోవడం, పక్షవాతం, చిక్కిపోవడం, మరణాలు సంభవిస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● కుక్క కాటు లేదా గాయానికి వెంటనే నీటితో, సబ్బుతో శుభ్రంగా కడగాలి.
● యాంటీసెప్టిక్ లేదా ఆల్కహాల్ ఉపయోగించి కాటు ప్రాంతాన్ని శుభ్రపరచాలి.
● కాటు లేదా గాయానికి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రేబిస్ వ్యాధి గురించి ఖచ్చితమైన నిర్ధారణ కోసం వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి.
● రేబిస్ వ్యాధి సోకిన గాయాల తర్వాత వెంటనే పీఈపీ (పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రోపీలాక్సిస్) టీకాలు ఇవ్వడం ద్వారా రక్షణ పొందవచ్చు.
● ఒకసారి కాటు గాయం జరిగిన తర్వాత 0వ రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు టీకాలు వేయించాలి.
● రేబిస్ వ్యాధి సోకకుండా ముందస్తు రక్షణ కోసం ప్రీ ఎక్స్‌పోజర్ వ్యాక్సిన్ వేయించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా జంతువులతో ఎక్కువగా పని చేసే వాళ్లకు అత్యవసరం.
పెంపుడు జంతువులకు చేయవలసిన చర్యలు
● పెంపుడు కుక్కలు, పిల్లులకు రేబిస్ వ్యాధికి వ్యతిరేకంగా టీకాలు వేయించడం అత్యంత అవసరం.
● చిన్న వయస్సులోనే (తొలకరి నెల) రేబిస్ టీకా మొదలవుతుంది. తరువాత ప్రతి సంవత్సరం టీకాలు వేయించాలి.
● జంతువులకు బాహ్య, అంతర్గత పరాన్నజీవాలను నివారించడానికి యాంటీ–పరాన్నజీవా మందులు ఇవ్వాలి.
● కీటకాలు, ఫ్లీస్, టిక్స్ వంటి జీవులను పర్యవేక్షించాలి.
వ్యాధి లక్షణాలు 14 రోజుల నుంచి ఏడాదిలోపు బయటపడతాయి. ఇది కుక్క కరిచిన ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. మనుషులలో వ్యాధి లక్షణాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి ప్యారలైటిక్, హైడ్రో ఫోబియా. 80 శాతం కేసుల్లో హైడ్రోఫోబియా లక్షణాలు ఉంటాయి. వీటిలో మనుషులు నీటిని చూసి భయపడటం, కరిచిన చోట జిలగా ఉండటం, గట్టిగా గాలివీచినా, వెలుగు పడినా భయపడుతుండటం కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే 3 నుంచి 5 రోజులు మాత్రమే జీవిస్తారు. ఫ్యారలైటిక్‌ఫాంలో నీటిని చూసి భయపడటం ఉండదు. గొంతు పడిపోవడం, పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. ఇక కుక్కల్లో ప్యూరియన్ ఫాం, డంబ్ ఫాం లక్షణాలు ఉంటాయి. ప్యూరియస్ ఫాంలో మేత తినకపోవడం, జ్వరంతో బాధపడటం, పరివర్తనలో మార్పు రావడం, చీకటిలో దాగడం, పరుగులు తీయడం, మనుషులను కరవడానికి ప్రయత్నించడం, వస్తువులను కరవడం, అరుపులో మార్పులు రావడం, చొంగలు కార్చడం, ఏ వస్తువునంటే వాటిని తీసుకుని నోట్లో పెట్టుకోవడం, కదలికలో తేడాలు, కాళ్లకు పక్షవాతం, మరణాలు సంభవిస్తాయి. డంబ్‌ఫాంలో దవడ కిందకు జారడం, పక్షవాతం, కోమా, మరణం 10 రోజుల లోపు సంభవిస్తుంది.
రేబిస్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. కుక్కలు, పిల్లుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, టీకాలు వేయించడం చాలా ముఖ్యం. కాటు సంభవించినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించి రేబిస్ వ్యాధి వ్యాప్తిని నిరోధించడం చాలా అవసరం.
– బీఆర్ శ్రీనివాసన్, పశువైద్యాధికారి

జూనోటిక్ వ్యాధుల రక్షణ ఇలా..