
రసాయన మందుల పిచికారీలో జాగ్రత్తలు
నూజివీడు: పంటలకు ఆశించే తెగుళ్ల నివారణకు రైతులు పురుగుమందులు వాడతారు. రసాయన మందులు విషపూరితమైనవి కావడం వల్ల వీటిని పంటలకు పిచికారీ చేసేటపుడు జాగ్రత్తలు పాటించాలి. వరి, మొక్కజొన్న, మినుము, పెసర, కూరగాయలు తదితర పంటలకు క్రిమిసంహారక మందులను పిచికారీ చేసేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణపాయం సంభవించే ప్రమాదం ఉంది. అలాగే మామిడి సీజన్‌లో రైతులు పూత రావడం దగ్గర నుంచి పిందె దశ వరకు విడతలు వారీగా రసాయన మందులను పిచికారీ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పురుగుమందులను పిచికారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయాధికారి పలగాని చెన్నారావు పలు సూచనలు చేశారు.
పాటించాల్సిన జాగ్రత్తలు
● పురుగుమందులను పిచికారీ చేసేటప్పుడు వ్యక్తి ముఖానికి మందంగా ఉండే కండువా లేదా మాస్క్‌ను ధరించాలి.
● చేతులకు గ్లౌజ్, కాళ్లకు పొడవాటి దళసరి బూట్లు వేసుకోవాలి. నిండుగా దుస్తులు ధరించాలి.
● పురుగు మందులను పిచికారీ చేసిన తరువాత మందు డబ్బాలను భూమిలో పాతిపెట్టాలి. చేతులను శుభ్రంగా రెండుసార్లు సబ్బుతో కడుక్కోవాలి.
● ఏ పంటకు ఎంత మోతాదులో పిచికారీ చేయాలో సంబంధిత అధికారులను గానీ, శాస్త్రవేత్తలను గానీ అడిగి తెలుసుకోవాలి.
● కళ్లు మంట పుట్టడం, దురద పుట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా నిర్లక్ష్యం వహించకుండా వైద్యుడిని సంప్రదించాలి.
● పురుగుమందుని నీటితో కలిపేటప్పుడు చేతిని కాకుండా కర్రను ఉపయోగించి కలపాలి
● పురుగు మందు డబ్బాల మూతను నోటితో తీయకూడదు.
● మందును పిచికారీ చేసిన చేతులతో బీడీ, సిగరెట్, చుట్ట తాగకూడదు.
● పురుగు మందులను మధ్యాహ్న సమయంలో పిచికారీ చేయకూడదు.
● గాలికి ఎదురుగా పురుగు మందులను పిచికారీ చేయకూడదు. అలా చేయడం వల్ల మందు మొక్కలపై పడకుండా పిచికారీ చేసే వ్యక్తిపైనే పడుతుంది.
● ఒకే వ్యక్తి ఎక్కువ విస్తీర్ణానికి మందులను పిచికారీ చేయకూడదు.
● పురుగు మందులను వేర్వేరుగానే పిచికారీ చేయాలి. ఒక పురుగు మందుని, కలుపు మందుతో కలపకూడదు. తెగులు మందుని, కలుపు మందుని కలపకూడదు.
● పురుగు మందులు శరీరంలోకి స్పర్శ, శ్వాస లేదా నోటి ద్వారా ప్రవేశించే ప్రమాదం ఉంది.
● పురుగు మందులను పిచికారీ చేసేటప్పుడు పురుగుమందు ప్యాకెట్‌పైన, పాంప్లెట్‌పైన ముద్రించిన సూచనలను చదివి పాటించాలి.
పాడి–పంట

రసాయన మందుల పిచికారీలో జాగ్రత్తలు

రసాయన మందుల పిచికారీలో జాగ్రత్తలు