
బాలకృష్ణది కొవ్వెక్కిన భాష
●అసెంబ్లీ సాక్షిగా చిరంజీవికి క్షమాపణ చెప్పాలి
●జనసేన అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు
తాడేపల్లిగూడెం: బాలకృష్ణ చిరంజీవిని వాడు వీడు అని మాట్లాడటం ఎంత కొవ్వెక్కిన భాష.. ఈ విషయంలో బాలకృష్ణ చిరంజీవికి అసెంబ్లీ సాక్షిగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. అంటూ జనసేన అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజలంతా చూస్తున్న రికార్డెడ్ ప్రోగ్రాంలో బాలకృష్ణ ఇలా మాట్లాడటం సరికాదన్నారు. బాలకృష్ణ అసలు చిరంజీవి గురించి ప్రస్తావించకూడదన్నారు. కొవ్వెక్కిన భాషను బాలకృష్ణ వాడారన్నారు. జనసేన పార్టీ కూటమిలో ఉన్నందున చిరంజీవి వేరు, పవన్ వేరని బాలకృష్ణ అనుకుంటున్నట్టున్నారని చెప్పారు. చిరంజీవి గురించి బాలకృష్ణ అవాకులు, చవాకులు పేలితే ఆయన అసలు అసెంబ్లీకి రాకపోదురేమో అనిపిస్తోందన్నారు. ఈ విషయంలో జనసేన చాలా సీరియస్‌గా ఉందన్నారు. బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిపై చేసిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు.
ఉండి: కమ్యూనిటీ సైన్స్ (హోం సైన్స్) కోర్సులో ప్రవేశానికి ఈనెల 30వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని ఎన్నార్పీ అగ్రహారం కృషీ విజ్ఞాన కేంద్రం హోంసైన్స్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ దెబోరా మెస్సియానా ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగేళ్ల కాలపరిమితి గల ఈ డిగ్రీ కోర్సును బీఎస్సీ ఆనర్స్‌గా పిలుస్తున్నారని, ఇందులో చేరేందుకు ఇంటర్ బైపీసీ, ఎంపీసీ ఉత్తీర్ణులైన విద్యార్థులు, 3 ఏళ్ల హోంసైన్స్, అగ్రికల్చర్ డిప్లమో గ్రూపులో పాసైన విద్యార్థులు అర్హులన్నారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కమ్యూనిటీ సైన్స్ కోర్సులో చేరి విద్యార్థులు తమ భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఇన్ అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ద్వారకాతిరుమల: దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం అధికారులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు శనివారం పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా శ్రీవారి దేవస్థానం ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి దంపతులు, అలాగే ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్‌వీఎన్‌ఎన్ నివృతరావు దంపతులు అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ పట్టు వస్త్రాలతో దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. అనంతరం వాటిని దుర్గ గుడి ఈఓ సీనా నాయక్‌కు అందజేసి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత ఈఓ మూర్తి, అనువంశిక ధర్మకర్త నివృతరావు దంపతులకు అర్చకులు, పండితులు వేద ఆశీర్వచనాన్ని అందించగా, ఈఓ సీనా నాయక్ దుర్గమ్మ చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఏటా దేవీ శరన్నవరాత్రుల్లో దుర్గమ్మకు చినవెంకన్న దేవస్థానం పట్టు వస్త్రాలను అందించడం ఆనవాయితీ. కార్యక్రమంలో ఆలయ ఏఈఓలు పి.నటరాజారావు, రమణరాజు, సిబ్బంది పాల్గొన్నారు.