
తణుకులో భారీ చోరీ
వృద్ధురాలిని భయపెట్టి 70 కాసుల బంగారు ఆభరణాల అపహరణ
తణుకు అర్బన్: ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు దోచుకున్న ఘటన తణుకులో సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తణుకు లయన్స్ క్లబ్ ప్రాంతంలోని వారణాసి వారి వీధిలో నివసిస్తున్న వాకలపూడి కనకదుర్గ ఇంట్లోకి శుక్రవారం రాత్రి సుమారు 2 గంటల సమయంలో ప్రవేశించిన దొంగలు సుమారుగా 70 కాసుల బంగారు ఆభరణాలు, రూ.70 వేలు నగదు దోచుకున్నారు. నోరెత్తితే చంపేస్తామని బెదిరించిన దొంగలను చూసి హడలెత్తిపోయిన వృద్ధురాలు వారికి సహకరించాల్సిన దుస్థితి నెలకొంది. వృద్ధురాలి భర్త మాజీ కౌన్సిలర్ వాకలపూడి వీరరాఘవులు గతంలోనే మృతిచెందగా కుమారులు ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇంట్లో ఎవరూ లేరనే పక్కా సమాచారంతో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు వృద్ధురాలిని భయబ్రాంతులకు గురిచేసి అందినకాడికి దోచుకుపోయారు. ఇంటి వెనుక భాగం నుంచి లోపలకు దొంగలు వచ్చారని చోరీలో నలుగురు దుండగులు ఉన్నట్లుగా బాధితవర్గాలు చెబుతున్నారు. తెల్లవారుజామున పోలీసులకు బాధితురాలు సమాచారం ఇవ్వడంతో తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్ హుటాహుటిన వచ్చి ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. తణుకు పట్టణ సీఐ ఎన్.కొండయ్యకు కేసు దర్యాప్తుపై పలు సూచనలు చేశారు.