
ఏలూరు క్లబ్బు.. పేకాట గబ్బు
గత ప్రభుత్వంలో ఉక్కుపాదం..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: మహాత్మా మన్నించు.. స్వాతంత్య్ర సమరంలో ప్రజలను ఉద్యమం వైపు నడిపిన గాంధీజీ విడిది చేసిన ప్రాంతమిది. ఇక్కడి నుంచే వందలాది మందిని మహాత్ముడు నడిపించారు. ఏలూరు నగరంలో మహాత్మా గాంధీకి విడదీయరాని అనుబంధం ఉన్న వాటిలో ది ఏలూరు క్లబ్ ఖ్యాతిగాంచింది. అయితే ప్రస్తుతం అంతటి ప్రాధాన్యమున్న క్లబ్ రిక్రియేషన్ ముసుగులో భారీ జూద శిబిరంగా మారిపోయింది. కేవలం సభ్యులు మాత్రమే ఉండాల్సిన క్లబ్‌లో నిత్యం వందలాది మంది జూదరులు దర్శనమిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరితో పాటు కృష్ణా, గుంటూరు, తెలంగాణ నుంచి సైతం పదుల సంఖ్యలో జూదరులు వచ్చి నిత్యం రూ.లక్షల్లో పేకాట శిబిరం కొనసాగిస్తున్నారు. కేవలం రోజు వారి మామూళ్లే రూ.6 లక్షల చొప్పున నెలకు రూ.1.80 కోట్లు చెల్లిస్తున్నారంటే క్లబ్‌లో ఏ స్థాయిలో దందా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
యథేచ్ఛగా జూదం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో జూదం యథేచ్ఛగా సాగుతోంది. గోవాలో క్యాసినోలను తలపించే రీతిలో భారీ జూద శిబిరాలు జిల్లాలో ఏదొక ప్రాంతంలో నిత్యం కొనసాగుతున్నాయి. తాజాగా నెల రోజుల నుంచి జూదరులకు కేరాఫ్ అడ్రస్‌గా ఏలూరు క్లబ్ మారిపోయింది. రూ.50 వేలు, 25 వేలు బోర్డులు ఏర్పాటు చేసి 21 ముక్కల పేకాటను నిర్వహిస్తున్నారు. ప్రతి బోర్డులో ఒక గేమ్‌కు 8 మంది చొప్పున రోజుకు 8 గేమ్‌లు నిర్వహిస్తున్నారు. అలాగే రూ.10 వేలు, రూ.5 వేలు, రూ.2 వేలు ఇలా రకరకాల గేమ్‌ల్లో అయితే లెక్కే లేదు. రోజూ రూ.లక్షల ఎంట్రీ ఫీజుల పేరుతో జూదరుల నుంచి టార్గెట్ పెట్టి మరీ రూ.8 లక్షలు వసూలు చేసి రూ.2 లక్షలు క్లబ్ ఖాతాలో జమ చేస్తున్నారు. మిగిలిన రూ.6 లక్షలను పొలిటికల్, పోలీస్, ఇతరులకు రోజువారీ పంపకాలు కొనసాగిస్తున్నారు. మరో విశేషమేమిటంటే రూ.6 లక్షల్లో క్లబ్ నిర్వాహకుడు కూడా ఒక భాగం ఉంచుకుని దానిని కూడా రోజువారి ముడుపుల్లో కలిపి లెక్క చెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పేకాట శిబిరాల ద్వారా మొత్తంగా నెలకు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఇక సాధారణంగా రిక్రియేషన్ క్లబ్ అంటే చెస్ మొదలు బ్యాడ్మింటన్ వరకు క్రీడలు ఉంటాయి. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు క్లబ్‌లో ఆహ్లాదం, ఆరోగ్యం కోసం ఆడుతుంటారు. అయితే ఏలూరు రిక్రియేషన్ క్లబ్‌లో ఉదయం 8 గంటలకే జూదరులు క్యూ కడుతున్నారు. సమయంతో నిమిత్తం లేకుండా ఉదయం 8 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి వరకూ పేకాట కొనసాగుతోంది. అలాగే జిల్లాలో ఏ క్లబ్‌లో లేని తరహాలో ఎవరైనా రూ.వెయ్యి చెల్లిస్తే చాలు ఏ పేకాటైనా ఆడటానికి ఇక్కడ అనుమతి ఉంది. మళ్లీ బోర్డును బట్టి డిపాజిట్ తప్పనిసరిగా చెల్లించాలి.
మహాత్మా.. మన్నించు..
బాపూజీ నడయాడిన చోట పేకాట క్లబ్
రాష్ట్రంతో పాటు తెలంగాణ నుంచి జూదరులు
పొలిటికల్ నుంచి పోలీస్ వరకూ రూ.కోట్లలో మామూళ్లు
ఏలూరు క్లబ్‌లో రిక్రియేషన్ ముసుగులో పేకాట దందా
వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే నిర్వహణ
అయినా పట్టించుకోని పోలీసు ఉన్నతాధికారులు
గోదావరి జిల్లాల్లో కేవలం సంక్రాంతి సమయంలో మూడు రోజులు మాత్రమే కోడిపందేలు, పేకాట కొనసాగుతుంటాయి. మిగిలిన సందర్భాల్లో చెరువు గట్లపైనా, ఊరి బయట నిర్జీవ ప్రాంతాల్లో అక్కడక్కడా పేకాట ఆడుతుంటాయి. పోలీసులు మాత్రం చెరువు గట్టు మొదలు అన్ని చోట్లా హడావుడి చేసి కేసులు నమోదు చేసి జూదరులను అరెస్టు చేసి సగటున రూ.5 వేల నుంచి రూ.40 వేల వరకు నగదు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటిస్తుంటారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఏ ఒక్క క్లబ్‌కూ అనుమతి లేకుండా జూదంపై సీరియస్‌గా ఉక్కుపాదం మోపారు. గతంలో పోలీసు ఉన్నతాధికారికి ఒక మహిళ పోస్టుకార్డు రాసింది. కార్డులో జూదంతో వందల కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయని, తన మంగళసూత్రాలు పేకాటకు బలికాకుండా కాపాడండి అంటూ రాసిన లేఖ సంచలనం కాగా.. పోలీసు అధికారులు వరుస దాడులతో సీరియస్‌గా కట్టడి చేశారు. ఇప్పుడు మాత్రం పొలిటికల్ పేరుతో వ్యవహారాలకు తలొగ్గి పోలీసులు పూర్తిగా పట్టించుకోవడం లేదు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ పేకాట వ్యవహారం అందరికి తెలిసే జరుగుతుందనేది నగరంలో హాట్‌టాఫిక్. మరో విచిత్రమేమిటంటే ఏలూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వంద మీటర్ల దూరంలోనే ది ఏలూరు క్లబ్ ఉండటం గమనార్హం.