
పండగల వేళ.. పసిడి పరుగు
కాసు రూ.లక్షకు చేరనుందా?
నరసాపురం: బంగారం ధరలు ప్రతిరోజూ ఆల్‌టైం హై నమోదు చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.11 వేలు దాటింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా రూ.10 వేలు దాటేసింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులు, మరోవైపు షేర్ మార్కెట్ ఒడిదుడుకులు, ఇంకో వైపు ట్రంప్ సుంకాల బాదుడు, రూపాయిలో డాలర్ మారకం విలువ రూ.100కు చేరువుగా ఉండడం వంటి కారణాల నేపథ్యంలో ఇప్పట్లో ధరలు పెరగడమే కానీ, తగ్గేది ఉండదనేది బులియన్ ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నారు. అందనంత ఎత్తుకు చేరుకున్న బంగారం ధరల ఎఫెక్ట్ అమ్మకాలపై పడింది. పెళ్లిళ్లు వంటి సామాజిక అవసరాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే మధ్య తరగతి వారు బంగారం ధరలు చూసి కనీసం గోల్డ్ షాపుల మెట్లెక్కాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. శుక్రవారం నరసాపురం బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,16,910 వద్ద ట్రేడయ్యింది. 22 క్యారెట్ల 916 కేడీఎం బంఽగారం ధర రూ. 1,05,500కు చేరింది. అంటే కాసు ఆభరణాల బంగారం ధర రూ.84,400. కాసు బంగారు వస్తువులు చేయించుకోవాంటే తరుగు, మజూరులను కలుపుకుంటే రూ 90 వేల కంటే పెట్టాలి.
పండగల విక్రయాలపై ప్రభావం
దసరా, దీపావళి పండగల రోజుల్లో బంగారం విక్రయాలు జోరుగా సాగుతాయి.
ఇక క్రిస్మస్, సంక్రాంతి పండగలు కూడా సమీపానే ఉన్నాయి. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలైంది. అయితే బంగారం ధరల పెరుగుదల బంగారం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపింది. వరుస పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లో కళకళలాడాల్సిన జ్యూయలరీ షాపులు ఉమ్మడి పశ్చిమలో వెలవెలబోతున్నాయి. గోదావరి జిల్లాలోనే అతిపెద్ద బులియన్ మార్కెట్‌గా పేరున్న ఒక్క నరసాపురం మార్కెట్‌లోనే హోల్‌సేల్, రిటైల్ కలిపి రోజుకు రూ.4 కోట్లు వరకూ బంగారం అమ్మకాలు జరుగుతాయి. ఉమ్మడి పశ్చిమలోని ఏలూరు, తుణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాల్లో పెద్దెత్తున అమ్మకాలు సాగుతాయి. పెరిగిన ధరలతో ఉమ్మడి పశ్చిమలో రోజుకు రూ.2 కోట్లుపైనే అమ్మకాలు తగ్గినట్టుగా అంచనా. దాదాపు 40 శాతం అమ్మకాలు తగ్గిపోయాయయని బులియన్ వర్తకులు చెబుతున్నారు.
గోల్డ్ వస్తువులు
నరసాపురంలో ఓ జ్యూయలరీ షాపు
బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. చాలా నెలలుగా ధరలు పెరగడమే కానీ, తగ్గడం కనిపించలేదు. మధ్యలో ఒకరోజు స్వల్పంగా తగ్గినా, మర్నాడు మళ్లీ రెట్టింపు పెరుగుండడంతో బంగారం ధరలను అంచనా వేయలేకపోతున్నాం. ప్రస్తుతం అమ్మకాలు దాదాపు 40 శాతం తగ్గాయి. లిక్విడ్ క్యాష్‌తో ఎవరూ బంగారం కొనుగోళ్లు చేయడంలేదు. పాత బంగారం మార్చుకుని కొత్త వస్తువులు ఆర్డర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఇదే వ్యాపారం ఎక్కువగా సాగుతోంది.
– వినోద్‌కుమార్‌జైన్, నరసాపురం బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
ధరలు దారుణంగా పెరగడంతో ఆభరణాల అమ్మకాలు పడిపోయాయి. పెళ్లిళ్లు వంటి సామాజిక అవసరాలకు బంగారం కొనేవారు కూడా వాయిదాలు వేసుకుంటున్నారు. పెట్టుబడిగా కొనే బిస్కెట్ అమ్మకాలు మాత్రం కాస్త బాగానే సాగుతున్నాయని చెబుతున్నారు. ఇక పాత బంగారం మార్పిడి జోష్ అన్ని పట్టణాల్లో కొనసాగుతోంది. ధరలు హైలో ఉండటంతో పాతబంగారం మార్పిడికి ఇదే అనుకూల సమయంగా కొనుగోలుదారులు భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుత్ను అమ్మకాల్లో 50 శాతం వాటా పాత బంగారం మార్పిడితోనే జరుగుతుందని చెబుతున్నారు.
10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష ఎప్పుడో దాటేసింది. సాధారణంగా వాడుకభాషలో జనం మాట్లాడుకుంటే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర గురించి మాట్లాడుకుంటారు. కాసు బంగారం... ఇవాళ రేటెంతుందని అడుగుతారు. ప్రస్తుతం 22 క్యారెట్ల ఆభరణాల బంగారం కాసు(8గ్రాములు) ధర రూ.84,400గా ఉంది. మరికొన్ని రోజుల్లోనే కాసు ధర కాస్త రూ.లక్ష మార్కును చేరుతుందని భావిస్తున్నారు. అప్పుడు తరుగు, మజూరులతో కాసు బంగారు వస్తువు కొనాలంటే లక్షపైనే చూసుకోవాలి.
రూ.11 వేలు దాటిన గ్రాము ధర
వెండిదీ.. అదే జోరు
తగ్గిన అమ్మకాలు
ఉమ్మడి పశ్చిమలో రోజుకు రూ.2 కోట్లకుపైనే అమ్మకాలు డౌన్
అన్ని పట్టణాల్లో
పాత బంగారం మార్పిడి జోష్

పండగల వేళ.. పసిడి పరుగు

పండగల వేళ.. పసిడి పరుగు