
లక్కవరం చోరీ కేసు ఛేదన
● నలుగురు నిందితుల అరెస్ట్, ఒకరు పరారీ
● 246 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఇంటి తలుపులు పగులగొట్టి బెడ్‌రూమ్‌లో నిద్రిస్తోన్న భార్యభర్తను కొట్టి బీరువాలోని సుమారు 40కాసుల బంగారు ఆభరణాలు, 2కిలోల వెండిని దోచుకుపోయారు. ఈ చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసిన, పోలీసులు చోరీ సోత్తును స్వాదీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ శుక్రవారం కేసు వివరాలను వెల్లడించారు. లక్కవరంలోని రామాలయం వీధిలో ప్రాంతానికి చెందిన వందనపు లక్ష్మీకుమారి తన భర్తతో కలిసి జీవిస్తోంది. ఈ నెల 23 తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు గది తలుపులు పగులగొట్టి బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించి, భర్తను నోరుమూసివేసి, కర్రలతో కొట్టి బీరువాలోని సుమారు 40కాసుల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులు దోచుకువెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు.
పాత నేరస్తుడే సూత్రదారి
ఈ దర్యాప్తులో పాతనేరస్తుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. లక్కవరం గ్రామానికి చెందిన దేవర శ్రీరామ్మూర్తి అనే వ్యక్తిపై కేడీ షీట్ ఉంది. పాతనేరస్తుడు కాగా వయసు రీత్యా తాను చోరీలకు పాల్పడకుండా తనకు తెలిసిన నేరగాళ్లతో చోరీలు చేయిస్తున్నాడు. బాపట్ల జిల్లా స్టువర్టుపురానికి చెందిన దొంగలను తీసుకువచ్చి చోరీలు చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బాధితురాలు లక్ష్మీకుమారి ఇంటి పక్కనే నివాసం ఉంటోన్న బాజీ అనే వ్యక్తి ఆమె ఇంట్లో డబ్బు, బంగారం భారీగా ఉందని శ్రీరామ్మూర్తికి సమాచారం ఇచ్చాడు. దీంతో శ్రీరామ్మూర్తి బాపట్ల స్టువర్టుపురం నుంచి అంగడి విల్సన్‌బాబు, గజ్జెల వాసు, కావేటి ప్రసాద్ అలియాస్ రమేష్ అలియాస్ చిన్న అనే ముగ్గురు దొంగలను లక్కవరం గ్రామానికి పిలిపించి చోరీ చేయించాడు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా కావేటి ప్రసాద్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ నిందితులపై నల్లజర్ల, పెరవలి స్టేషన్లలోనూ కేసులు ఉన్నాయి. పాత నేరస్తుడు శ్రీరామ్మూర్తిపై ఏకంగా 14 కేసులు ఉండగా, విల్సన్‌బాబుపై ఆరు కేసులు, వాసుపై ఏడు కేసులు, పరారీలో ఉన్న ప్రసాద్‌పై 12కేసులు ఉన్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిందితుల నుంచి 246 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇనుప రాడ్డు, రెండు కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ కేసును ఛేదించటంలో జంగారెడ్డిగూడెం సీఐ సుభాష్, చింతలపూడి సీఐ క్రాంతికుమార్, ఫింగర్‌ప్రింట్స్ సీఐ పి.శ్రీనివాసరావు, జంగారెడ్డిగూడెం ఎస్సై ఎస్‌కే జబీర్, ఏఎస్సై సంపత్‌కుమార్‌తో సహా కానిస్టేబుల్స్‌ను జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు.