
యువకుడి అదృశ్యం
తణుకు అర్బన్: యువకుడు అద్యశ్యమైన ఘటన పట్టణంలో సంచలనం సృష్టిస్తుంది. వివరాల ప్రకారం తాడేపల్లిగూడేనికి చెందిన మడుగుల సురేష్ (29) ఈనెల 23న తెల్లవారుజామున తణుకు వచ్చాడని ఆ రోజు నుంచి తన సోదరుడు కనిపించడం లేదని అతని సోదరి ముచ్చె ప్రశాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 25న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ గతంలో తణుకు మునిసిపాలిటీ అవుట్ సోర్సింగ్‌లో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో పని చేస్తూ రాష్ట్రపతి రోడ్డులోని సాయిబాబా గుడి వెనుక ప్రాంతంలో నివాసం ఉండేవారు. అయితే ఇటీవల తాడేపల్లిగూడెంలో పెయింటింగ్ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నట్లుగా తెలుస్తోంది.
అదృశ్యంపై అనుమానాలు
ఈ నెల 23వ తేదీన తనకు సన్నిహితంగా ఉండే స్నేహితురాలిని కలిసేందుకు తాడేపల్లిగూడెం నుంచి తణుకు వచ్చినట్లుగా సురేష్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ రోజు నుంచి కనిపించకపోవడంతో పాటు మొబైల్ కూడా స్విచ్చాఫ్ అవడంతో ఆ కుటుంబం ఆందోళనతో ఈనెల 25న తణుకు పట్టణ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి తణుకులో ఒక న్యాయవాది కుటుంబంలో తలెత్తిన వివాదానికి, యువకుడి అదృశ్యానికి సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు న్యాయవాది కూడా పరారీలో ఉన్నారని పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఐదు రోజులుగా సురేష్ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.