
ఆది కర్మయోగి కార్యక్రమంపై సమీక్ష
ఏలూరు (మెట్రో): ఆది కర్మయోగి కార్యక్రమంలో గ్రామ విజన్ ప్లాన్ రూపకల్పనపై ఢిల్లీ లోని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి జిల్లాల కలెక్టర్లతో గురువారం జూమ్ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఆది కర్మయోగి కార్యక్రమంపై గ్రామ విజన్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నామని, ప్రత్యేక గ్రామ సభల్లో ప్రజల ముందు ఉంచి ఆమోదింపజేస్తామన్నారు. అనంతరం ఆది కర్మయోగి కార్యక్రమంలోని గ్రామ విజన్ ప్రణాళిక రూపకల్పనపై జిల్లాలోని ఐటీడీఏ, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్ పనులకు సంబంధించిన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ నుంచి అధికారులతో జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏలూరు, తూర్పుగోదావరి, మన్యం జిల్లాలలోని పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు భూమికి భూమి, ఆర్‌అండ్‌ఆర్ కాలనీల నిర్మాణాలు, తదితర పనులకు గాను ఏలూరు జిల్లాలో 4,434 ఎకరాల భూమి అవసరం కాగా ఇప్పటికే బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో గుర్తించిన భూములకు సంబంధించి భూసేకరణ ప్రకటనలు జారీ చేయాలన్నారు. మిగిలి ఉన్న భూసేకరణ పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాలలో భూసేకరణకు అవసరమైన భూములను గుర్తించాలని, తర్వాత ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
జీఎస్టీ తగ్గింపుపై అవగాహన
జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కటుంబానికి ప్రతి నెలా ఎంత మేర ఆదా అవుతుందో తెలియజేసేందుకు ఈనెల 26 నుంచి అక్టోబర్ 19 వరకు జిల్లాలో ‘సూపర్ జీఎస్టీ... సూపర్ సేవింగ్స్’ పేరుతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జీఎస్టీ 2.0 కింద ప్రజలకు కలిగే లబ్ధిపై అవగాహన కార్యక్రమాల నిర్వహణపై జీఎస్టీ అధికారులతో కలిసి గురువారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.