
ఆదమరిస్తే.. ప్రాణాలు గోవిందా!
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రానికి వివిధ వాహనాలపై వెళుతున్న భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. పెద్దపెద్ద గుంతలు పడ్డ ఈ రహదారిపై ప్రయాణం నరక ప్రాయంగా మారింది. బైక్‌లపై వెళుతున్న వారి ఇక్కట్లు ఇక చెప్పనక్కర్లేదు. తరచూ ప్రమాదాల బారిన పడుతూ క్షతగాత్రులు అవుతున్నారు. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తున్నారు. అందులో అధిక శాతం మంది కార్లు, ఆటోలు, బైక్‌లపై క్షేత్రానికి వెళుతున్నారు. ముఖ్యంగా దేవీ శరన్నవరాత్రులకు క్షేత్రానికి వచ్చే భక్తుల రాక ఎక్కువగా ఉంది. అయితే భీమడోలు–ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన రహదారి ధ్వంసం కావడంతో బైక్‌లపై ప్రయాణించే భక్తులకు భద్రత లేకుండా పోయింది. ద్వారకాతిరుమలలోని కుంకుళ్లమ్మ ఆలయ సమీపంలో, నిమ్మకాయల మార్కెట్ యార్డు వద్ద, లక్ష్మీపురంలోని విర్డ్ ఆస్పత్రి వద్ద, గొల్లగూడెం సెంటర్‌లో, సూర్యచంద్రరావుపేట చెరువు వద్ద, పంగిడిగూడెంలో రోడ్డుపై ఏర్పడ్డ పెద్ద పెద్ద గుంతలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. నిత్యం ఎంతో మంది భక్తులు ఈ గుంతల వద్ద ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఒకే ప్రాంతంలో 9 ప్రమాదాలు
గడచిన నెలరోజుల్లో ఒక్క సూర్యచంద్రరావుపేటలోనే 10 ప్రమాదాలు జరిగాయి. అందులో ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురు క్షతగాత్రులయ్యారు. వారంతా 108 ఆంబులెన్స్‌లోనే ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. అలాగే విర్డ్ ఆస్పత్రి, గొల్లగూడెం తదితర ప్రాంతాల్లోని గుంతల వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గురువారం ఉదయం విర్డ్ ఆస్పత్రి వద్ద గుంతలను తప్పించే క్రమంలో బైక్ అదుపు తప్పడంతో ఓ భక్తుడు తన భార్యతో సహా రోడ్డుపై పడిపోయాడు. వెంటనే ఆమె లేచి మరికొందరు యాత్రికుల సహాయంతో తన భర్తను పైకి లేపింది.
వర్షాల వల్ల మరిన్ని ప్రమాదాలు
తరచూ కురుస్తున్న వర్షాల కారణంగా మరిన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. నీటితో నిండిన గుంతల లోతు తెలియక వాహనదారులు వాటిలోకి వేగంగా వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. కొత్త కార్లలో వచ్చే యాత్రికులు తమ వాహనాలు దెబ్బతింటున్నాయని లబోదిబోమంటున్నారు.
పట్టించుకోని పాలకులు, అధికారులు
పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు తరచూ ద్వారకాతిరుమల క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. అందులో ఏ ఒక్కరూ క్షేత్ర రహదారి అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. దాంతో కనీసం ఈ రహదారి మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఈ క్రమంలోనే కొందరు భక్తులు కూటమి ప్రభుత్వంపై మండి పడుతున్నారు. రహదారులను అభివృద్ధి చేస్తామని చెప్పి, భక్తుల శ్రేయస్సును ఇలా గాలికొదిలేసిందని ధ్వజమెత్తుతున్నారు.
ప్రమాదకరంగా ద్వారకాతిరుమల క్షేత్ర రహదారి
గుంతలు పడ్డ రోడ్డుపై.. నిత్యం ప్రమాదాలు
స్వామి దర్శనం కాకుండానే.. క్షతగాత్రులవుతున్న భక్తులు

ఆదమరిస్తే.. ప్రాణాలు గోవిందా!

ఆదమరిస్తే.. ప్రాణాలు గోవిందా!