
ఏజెన్సీలో భూసేకరణ నిలుపుదల చేయాలి
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో భూసేకరణ నిలుపుదల చేయాలని, నేవీ ఆయుధ కర్మాగార నిర్మాణం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్ చేసింది. గురువారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంజా కృష్ణంరాజు అధ్యక్షతన ఆదివాసీ ముఖ్య నాయకుల సమావేశం బుట్టాయగూడెంలో జరిగింది. ఏపీ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ మొడియం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటికే సేకరించి వివాదాల్లో ఉన్న వేల ఎకరాల భూమిని పోలవరం నిర్వాసితులకు కేటాయించడం వల్ల భూవివాదాలతో స్థానిక ఆదివాసీ నిర్వాసితులు, ఆదివాసీలు నిరంతరం గొడవలు పడుతూ అశాంతితో జీవిస్తున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏడు మండలాల పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను తీసుకువచ్చి వారికి బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో పునరావాసం కల్పించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. పెద్ద మొత్తంలో ప్రభుత్వం సొమ్మును దోచుకోవడానికి ఎల్‌టీఆర్ భూములను సేకరించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, దళారులు పడుతున్న తాపత్రయం, హడావిడి చూస్తుంటే భారీ కుంభకోణం జరుగుతుందని అర్థమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏటీఏ నాయకులు తెల్లం రాములు, తెల్లం గంగరాజు, కోర్సా నాగేశ్వరరావు, కుంజా రమేష్ పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): డిగ్రీ కళాశాలల్లో రెండో విడత ప్రవేశాలకు ఈ నెల 29వ తేదీ వరకు గడువు ఉందని ఏలూరు జిల్లా నోడల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యుడు గుత్తా గిరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్ష పాసైన విద్యార్థులు రెండో విడత ప్రవేశాల్లో భాగంగా ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఈనెల 29 నుంచి అక్టోబర్ 1 వరకు వెబ్ ఆప్షన్ ఇవ్వవలసి ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): నేవీ ఆయుధ డిపో పేరుతో చేస్తున్న భూసేకరణను వెంటనే నిలిపివేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం ఏలూరు పవరుపేటలో పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేవీ ఆయుధ డిపోకు సంబంధించి భూసేకరణకు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, కలెక్టర్ వెట్రిసెల్వి, నేవీ అధికారులు చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తున్నామన్నారు. గిరిజనులు ఆయుధ డిపోను వ్యతిరేకిస్తున్నా భూసేకరణకు ముందుకు సాగడం దారుణమన్నారు. సీపీఎం కేసులకు భయపడదని, ప్రజా సమస్యలపై పోరాడుతుందన్నారు. విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బీ. బలరాం, జిల్లా కార్యదర్శి ఏ. రవి, కార్యదర్శి సభ్యులు తెల్లం రామకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్, ఆర్. లింగరాజు, ఎం.నాగమణి, జీ.రాజు, కే.శ్రీనివాస్, పీ.రామకృష్ణ పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువకులకు రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషనింగ్ రిపేర్లలో ఉచిత శిక్షణ అందించనున్నట్టు యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ ఎం.ఫణి కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. 19–45 సంవత్సరాల మధ్య వయసు కలిగి, 5వ తరగతి ఆ పైన విద్యార్హత కలిగిన నిరుద్యోగులు ఈ శిక్షణకు అర్హులన్నారు. ఈ నెల 27వ తేదీన శిక్షణ ప్రారంభమౌతుందని, శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఫోన్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 95027 23561, 90140 40780, 95330 79471 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.