
మావుళ్లమ్మ భక్తులకు అన్నదాన కష్టాలు
భోజనానికి ఏటా అవస్థలే
చిన్న పిల్లలతో చాలా ఇబ్బందులు
మున్సిపల్ షాపులు తొలగిస్తే
● కూర్చొని తినే సౌకర్యం లేక ఇబ్బందులు
● ఏళ్ల తరబడి ఇరుకు గదిలోనే అన్నదానం
భీమవరం(ప్రకాశం చౌక్): రాష్ట్రంలోనే ప్రముఖ దేవస్థానం శ్రీమావుళ్లమ్మ వారి దేవస్థానంలో భక్తులను అన్నదాన కష్టాలు వెంటాడుతున్నాయి. కనీసం ముప్పై మంది కూడా పట్టని గదిలో అన్నప్రసాదాన్ని అందించడంతో భక్తులు నిలబడి ఒకరిపై ఒకరూ పడుతూ అన్నప్రసాదం తినాల్సి వస్తుందని వాపోతున్నారు. అమ్మవారి ప్రసాదంగా భావించి భోజనం చేయాలంటే బయట రోడ్డుపై క్యూలైన్‌లో నుంచి చినపాటి సందులోకి వెళ్లి ఇరుకు గదిలో భోజనం చేసి రావాలి. దీంతో మహిళలు, చిన్న పిల్లలతో వచ్చేవారు, వృద్ధులు చాలా చాలా ఇబ్బందులు పడుతు న్నారు. అమ్మవారి వార్షికోత్సవాలు, దసరా ఉత్సవా ల వంటి సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చినా కొందరికే అమ్మవారి భోజనం దక్కుతుంది.
రెండు సెంట్లల్లోనే ఆఫీసు, భోజనశాల
మావుళ్లమ్మ దేవస్థానంలో రెండు సెంట్లల్లో నిర్మించిన భవనంలో పైన దేవస్థానం ఆఫీసు, కింద గదిలో భోజనశాల ఉంది. ఈ భవనం ఇరుగ్గా ఉండడం వల్ల అటు ఆఫీసుకు ఇటు భోజనశాలకు కూడా సరిపోక దేవస్థానం సిబ్బంది, భక్తులు ఇబ్బందులుపడుతున్నారు. లోపల భవనంలో కనీసం నిలబడడానికి కూడా వీలు లేకపోవడంతో రోడ్డుపై భక్తులు క్యూలో నిల్చుంటున్నారు. భక్తుల వల్ల ఈ రోడ్డులో ట్రాఫిక్ సమస్య కూడా పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.
టోకెన్ లెక్కల ప్రకారమే భోజనం
మావుళ్లమ్మ దర్శనం కోసం హైదరాబాద్, విశాఖ, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి దూర ప్రాంతాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల నలుమూల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఎంత మంది వస్తే అంత మందికి భోజనం పెట్టకుండా టోకెన్ల ప్రకారమే ఇక్కడ భక్తులకు భోజనం పెడుతున్నారు. సాధారణ రోజుల్లో 170 నుంచి 200 మందికి, ఉత్సవాల సమయంలో 250 నుంచి 300 మందికి మాత్రమే భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ఆ భోజనం కూడా ఇరుకు గదిలో పెట్టడం వల్ల అవస్థలు పడుతూ తినాల్సి వస్తుందని భక్తులు వాపోతున్నారు. అమ్మవారికి భక్తులు సమర్పించే కానుకలు, శాశ్వత నిత్యన్నదానం కోసం వచ్చే విరాళాలతో మంచి ఆదాయం వస్తున్నప్పటికీ అమ్మవారి భోజన ప్రసాదం కొందరి భక్తులకే దొరుకుతుంది. ఆలయం వద్ద ఇన్ని ఇబ్బందులు ఉన్నా దేవదాయ ఉన్నతాధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
రోడ్డుపై క్యూలైన్‌లో టోకెన్ల కోసం భక్తుల అవస్థలు
ఇరుకు గదిలో భోజనం చేస్తున్న భక్తులు
మేము ప్రతి ఏడాది దసరా, వార్షికోత్సవాల్లో మావుళ్ల మ్మను దర్శించుకోవడానికి వస్తాం. ప్రతిసారీ కూడా అమ్మవారి భోజన ప్రసాదం కోసం అవస్థలు పడుతున్నాం. చిన్న గదిలో భోజన ప్రసాదం పెట్టడం వల్ల ప్రసాదం ప్రశాంతంగా సంతృప్తిగా తినలేకపోతున్నాం. భోజనశాల విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలి.
– కె.భాస్కరలక్ష్మి, హైదరాబాద్
దసరా మహోత్సవాల్లో మావుళ్లమ్మ వారిని దర్శించుకోవడానికి ప్రతి ఏడాదీ వస్తాం. అయితే అమ్మవారి భోజన ప్రసాదం సెంటిమెంట్‌గా భావించి ఇరుకు గదైనా ఇబ్బందిగా ఉన్నా భోజనం చేస్తున్నాం. అయితే పిల్లలతో వచ్చేవారు భోజన గదికి వెళ్లే సందులో, లోపల భోజనం చేయడానికి ఖాళీ సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నారు.
– కె.భాగ్యలక్ష్మి, హనుమాన్ జంక్షన్
శ్రీ మావుళ్లమ్మ వారి దేవస్థానం వెనుక వైపు సుమారు 3 సెంట్లల్లో ఉన్న మున్సిపల్ స్థలంలో అద్దె ప్రాతిపదికన పలు షాపులు ఉన్నాయి. వాటిని తొలగించి ఆ స్థలం అమ్మవారికి దేవస్థానానికి నిబంధనలు మేరకు అప్పగిస్తే అన్నదాన కష్టాలు తీరుతాయని భక్తులు చెబుతున్నారు. మావుళ్లమ్మ ఆలయం కారణంగానే మున్సిపాలిటీకి షాపుల ద్వారా ఏటా రూ.5.90 లక్షల ఆదాయం సమకూరుతుంది. భక్తుల ఇబ్బందుల దృష్ట్యా మున్సిపల్ అధికారులు, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు సమన్వయంతో నిర్ణయం తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుందని పట్టణవాసులు చెబుతున్నారు.

మావుళ్లమ్మ భక్తులకు అన్నదాన కష్టాలు

మావుళ్లమ్మ భక్తులకు అన్నదాన కష్టాలు

మావుళ్లమ్మ భక్తులకు అన్నదాన కష్టాలు

మావుళ్లమ్మ భక్తులకు అన్నదాన కష్టాలు