
ఫార్మాసిస్ట్‌లు నిబంధనలు పాటించాలి
తణుకు అర్బన్: మందుల విక్రయాల్లో ఫార్మాసిస్ట్‌లు పూర్తిస్థాయిలో నిబంధనలు పాటించాలని డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పి.మల్లికార్జునరావు అన్నారు. ప్రపంచ ఫార్మాసిస్ట్ డే సందర్భంగా తణుకు డ్రగ్గిస్ట్ కెమిస్ట్ అసోసియేషన్ హాలులో గురువారం నిర్వహించిన ఫార్మాసిస్టుల అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్తు మందులు వినియోగించే వారిని గుర్తించి వారికి ఆ మందుల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపట్ల అవగాహన కల్పించాలని సూచించారు. ఫార్మాసిస్ట్‌లు వైద్యులు సూచనల మేరకు మాత్రమే మందులు విక్రయిచాలని సూచించారు. అనంతరం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో 15 మంది అసోసియేషన్ సభ్యులు రక్తదానం చేశారు. సీనియర్ ఫార్మాసిస్ట్‌లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి రామ్‌చందర్, ఫార్మాసిస్ట్‌ల సంక్షేమ రాష్ట్ర ఉప కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేసే వారి ఉద్యోగ విరమణ వయస్సు 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచాలనే పంచాయితీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆగస్టు 31వరకు పని చేసిన, కె.గోపాల్ తన వయస్సు 65 ఏళ్లు వచ్చే వరకు వీసీ పదవిలో ఉంచాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఉద్యాన వర్సిటీ వీసీ వ్యవహారం 25 రోజులుగా ఇంకా తేలలేదు. తాజాగా ఇటీవల వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్‌గా పని చేసి 62 ఏళ్లు ముగియడంతో ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్ నారం నాయుడు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రమాదేవి, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పని చేసి తాజాగా ఉద్యోగ విరమణ చేసిన ఓబయ్య అనే వ్యక్తి కూడా ఉద్యోగ విరమణ వయస్సును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచాలని హైకోర్టులో రిట్ పిటిషన్లు వేసినట్టు సమాచారం.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్యంలో అక్టోబర్ 7 నుంచి భారత్ గౌరవ్ యాత్ర ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఐఆర్‌సీటీసీ విజయవాడ యూనియన్ మేనేజర్ ఎం. రాజా తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఏలూరులో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ యాత్ర సికింద్రాబాద్ నుండి ప్రారంభమై ద్వారకా, సోమనాథ్, అహ్మదాబాద్, మోథేరా, పటాన్, స్టాట్యూఆఫ్ యూనిటీ వరకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ యాత్రలో ద్వారకాదీష్ టెంపుల్, నాగేశ్వర్ టెంపుల్, ద్వారకా, సోమనాథ్ ఆలయం, శబర్మతి ఆశ్రం, మోథేరాజ్ సూర్యదేవాలయం, రాణి కి వాప్ (పటాన్), సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (ఏక్తానగర్‌లను సందర్శించవచ్చని వివరించారు. ఈ యాత్రకు స్లీపర్‌క్లాస్‌లో పెద్దలకు రూ.18,400లు, 11 సంవత్సరాలోపు పిల్లలకు రూ.17,300లు, థర్డ్‌క్లాస్ ఏసీలో పెద్దలకు రూ.30,200, పిల్లలకు రూ. 28,900లు, సెకండ్‌క్లాస్ ఏసీలో పెద్దలకు రూ.39,900, పిల్లలకు రూ. 38,300గా టిక్కెట్ రేటు నిర్ణయించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9281495848, 9281030714 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
తాడేపల్లిగూడెం రూరల్: మోటారు సైక్లిస్ట్‌ను వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో ఒక బాలుడు మృతి చెందినట్లు రూరల్ హెడ్ కానిస్టేబుల్ ఎండీ జిలానీ తెలిపారు. గురువారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కొండ్రుప్రోలు కేఎస్‌ఎన్ కాలనీకి చెందిన రెడ్డి నాగబాబు(16) సుజుకీ యాక్సెస్ మోపెడ్‌పై తణుకు నుంచి ఏలూరు వైపుగా వస్తుండగా కొండ్రుప్రోలు జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనపై మృతుని తల్లి రెడ్డి మోహన లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ జిలానీ తెలిపారు.