
అదును చూసి దోచేస్తున్నారు!
అప్పటికప్పుడు మెషీన్లతో కోత
● రైతులతో ధాన్యం దళారుల ఆటలు
● ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఇష్టారీతిగా కొనుగోళ్లు
తాడేపల్లిగూడెం రూరల్: వరుస తుఫాన్లు, వాయుగుండాలతో ఒక పక్క రైతు హడలిపోతుంటే మరో పక్క ధాన్యం కమీషన్‌దారులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. వర్షాల ప్రభావంతో పండించిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునే పనిలో తాడేపల్లిగూడెం మండలంలోని రైతులు నిమగ్నమయ్యారు. అయితే ఈ వర్షాలను సాకుగా చేసుకుని రైతు నుంచి అయినకాడికి ధాన్యాన్ని దళారులు కొనుగోలు చేస్తున్నారు. ఒక్క తాడేపల్లిగూడెం మండలంలోనే ఈ ఖరీఫ్ సీజన్‌లో 24,300 ఎకరాల్లో వరి సాగు చేశారు. పీఆర్–126 ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఎకరాలు కాగా, స్వర్ణ రకం 10 వేల ఎకరాలు, సంపత్ స్వర్ణ 7 వేల ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం పీఆర్–126 రకం వరి చేలు చేతికి రావడంతో రైతులు కోతలు ప్రారంభించారు.
నాలుగు వేల ఎకరాల్లో కోతలు పూర్తి
ఇప్పటికే మండలంలోని నాలుగు వేల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ధాన్యాన్ని గట్టెక్కించేందుకు రైతులు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గత నాలుగు రోజుల క్రితం వరకు 75 కిలోల బస్తా ధాన్యం రూ.1190కు కొనుగోలు చేయగా, నేడు రూ.1160కు కమీషన్‌దారులు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో బస్తాకు రూ.30 తగ్గించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి రైతుల నుంచి కమీషన్‌దారులు ఒక్కో రోజు ఒక్కో ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే మెట్ట గ్రామాల్లో వరి కోతలు దాదాపు పూర్తి కావస్తున్నా నేటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు కనుచూపు మేరలో కానరావడం లేదు. ఇదే అదనుగా కమీషన్‌దారులు ముందస్తుగానే అయిన కాడికి ధాన్యాన్ని కొనుగోలు చేసి, సొమ్ము చేసుకుంటున్నారు.
ధాన్యం 75 కిలోల బస్తా వెయ్యి రూపాయలకు కొనుగోలు చేసేది లేదంటూ కమీషన్‌దారులు భీష్మించుకుని కూర్చున్నారు. ఎట్టకేలకు రూ.1160లకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో అప్పటికప్పుడు మెషీన్లను పెట్టి వరి కోతలు చేపట్టాం. ఏ క్షణాన వాతావరణం ఎలా ఉంటుందోనని ఆందోళన వెంటాడుతుంది.
– మైనం సత్యనారాయణ, లింగారాయుడిగూడెం

అదును చూసి దోచేస్తున్నారు!

అదును చూసి దోచేస్తున్నారు!