
పరిమితి మేరకు వర్జీనియా సాగు చేయాలి
జంగారెడ్డిగూడెం: వర్జీనియా సాగు బోర్డు సూచించిన పరిమితి మేరకు పండిస్తూనే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు ఆలోచన చేయాలని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ అన్నారు. జంగారెడ్డిగూడెంలోని వర్జీనియా వేలం కేంద్రాలను ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పొగాకు పైరుకు ప్రత్యామ్నాయ పంట వైపు రైతు దృష్టి సారించాలన్నారు. 365 రోజుల పచ్చదనం, పంట మార్పిడి, సేద్యంలో మెళకువలపై నిరంతరం అవగాహన కలిగి ఉండాలన్నారు. పొగాకు రైతులు వర్జీనియా పొగాకు మాత్రమే కాకుండా ఇతర వాణిజ్య పంటలను సాగు చేయాలన్నారు. మేలు రకమైన పంటను పండిస్తే మంచి ధర వస్తుందన్నారు. 2025–26 పంట కాలానికి వర్జీనియా పొగాకు బోర్డు 142 మిలియన్ కేజీల పొగాకును అనుమతించిందన్నారు. కాబట్టి రైతులు పరిమితిలోపు పంటను సాగు చేస్తూ మేలు రకమైన పొగాకును ఉత్పత్తి చేయాలని సూచించారు. అనంతరం రైతులు పలు సమస్యలను ఈడి విశ్వశ్రీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా పొగాకు బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ఆమె పరిశీలించి, శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. కాగా పొగాకు వేలం కేంద్రానికి సంబంధించి ఉద్యోగుల భర్తీ ప్రక్రియను త్వరలోనే నిర్వహిస్తామని విశ్వశ్రీ తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఎం జీఎల్‌కే ప్రసాద్, ఆక్షన్ మేనేజర్ కేవీ రామాంజనేయులు, ఏఎస్‌లు శ్రీహరి, సురేంద్ర, రైతు నాయకులు పరిమి రాంబాబు, కరాటం రెడ్డి బాబు, ఘంటసాల గాంధీ, అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.